Jagan Mohan Reddy : “ఎప్పటికయ్యేది ప్రస్తుతమో..”ఈ సామెతను రాజకీయ నాయకులు నిత్యం పాటిస్తూనే ఉంటారు. పైకి విలువలు.. ఇంకా ఏవేవో పాఠాలు చెబుతారు గాని.. వాళ్ల వరకు వచ్చేసరికి అవన్నీ ఏవి పట్టించుకోరు. జస్ట్ కార్యకర్తల్లో ఆగ్రహాన్ని పెంచడానికి.. సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకోవడానికి తప్ప నాయకుల మాటలు మిగతా విషయాల్లో ఎప్పుడూ ఒక స్టాండ్ మీద ఉండవు. అలా ఉంటే మనదేశంలో రాజకీయాలు ఇలా ఎందుకుంటాయి.. ఇక రాష్ట్రాల్లో అయితే మరి ఘోరం. ప్రాంతీయ పార్టీల్లో అయితే మరింత అధ్వానం. ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే.. ఆగండాగండి అక్కడికే వస్తున్నాం.
ప్రస్తుతం మన దేశంలో ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. ఎన్డీఏ కూటమి అభ్యర్థిని నిలబెట్టింది. పోటీగా ఇండియా కూటమి కూడా కేంద్రీకృత న్యాయ వ్యవస్థలో కీలకంగా పనిచేసిన వ్యక్తిని బరిలో ఉంచింది.. రెండు పార్టీల మధ్య పోటీ హోరాహోరిగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇండియా కూటమి అంత సులువుగా ఉపరాష్ట్రపతి పదవిని ఎన్డీఏ కూటమికి ఇచ్చేలాగా కనిపించడం లేదు. రాహుల్ గాంధీ బీహార్ లో బిజీగా ఉన్నప్పటికీ ఉపరాష్ట్రపతి వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పైగా హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో అధికారంలో ఉండడంతో గెలుపు మీద ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, జమ్ము కాశ్మీర్, ఇంకా కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి . అలాంటప్పుడు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని భాగస్వామ్య పార్టీల కూటమి భావిస్తోంది.
ఎన్డీఏ కూటమి ఏ అవకాశాన్ని కూడా ఇండియా కూటమికి ఇవ్వద్దు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇందులో బాగానే నేరుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి రంగంలోకి దిగి మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతున్నారు. ఏపీలో అధికారంలో లేకపోయినప్పటికీ రాజ్యసభలో వైసిపికి చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు ఉన్నాయి. పార్లమెంటు స్థానాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వేసే ఓట్లు కీలకంగా ఉండబోతున్నాయి. అందువల్లే జగన్ ను ఎన్డీఏ నేతలు సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని జగన్ అధికారికంగా ప్రకటించారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి జగన్ కు ఫోన్ చేశారు. దానికి ఆయన ఎన్డీఏ నేతలు తమతో మాట్లాడారని.. వారికి మాట కూడా ఇచ్చానని.. ఇలాంటప్పుడు మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్ట చేసినట్టు జగన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని వైసిపి అధికారిక సోషల్ మీడియా ప్రకటించింది.. అంతేకాదు ఇక్కడ జగన్ ను సర్వ పరిత్యాగి గా ప్రకటించింది. “జగన్ కు వ్యక్తిగతంగా సుదర్శన్ అంటే చాలా గౌరవం. న్యాయ వ్యవస్థ ద్వారా సుదర్శన్ రెడ్డి ప్రజలకు అపరమైన సేవలు అందించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యదా భావించవద్దని జగన్ బాధపడుతున్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్యస్ఫూర్తి ని కాపాడేందుకు సుదర్శన్ రెడ్డి విశేష కృషి చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా ఆయనకు మద్దతు ఇవ్వకపోవడం పట్ల జగన్ బాధపడుతున్నారని” వైసిపి అధికారిక సోషల్ మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది.
ప్రజాస్వామ్య పరిరక్షణకు.. ప్రజల సమస్యల పరిష్కారానికి సుదర్శన్ రెడ్డి కృషి చేశారని జగన్ చెబుతున్నప్పుడు.. కచ్చితంగా ఆయనకు మద్దతు ఇవ్వచ్చు కదా.. ముందుగానే ఎన్ డి ఏ నాయకులు సంప్రదింపులు జరిపారని చెబుతున్న జగన్.. ఇదే విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదు. సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసిన విషయాన్ని గొప్పగా చెప్పుకున్న జగన్.. ఎన్డీఏ నేతలు తనతో మాట్లాడిన మాటలను మాత్రం చెప్పలేకపోయారు. దీనిని బట్టి మద్దతు ఇస్తానని ముందుగానే జగన్ క్యాంప్ నుంచి సంకేతాలు వెళ్లాయని.. దానికి ఎన్ డి ఏ నేతలు కూడా సుముఖత వ్యక్తం చేశారని.. పైగా కేసుల భయం కూడా ఉంది కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ ఎన్ డి ఏ అభ్యర్థికి జై కొట్టారని టిడిపి నేతలు అంటున్నారు. ఒకవేళ ఇండియా కూటమి అభ్యర్థికి గనుక జగన్ మద్దతు ఇస్తే పరిస్థితి మరో విధంగా ఉండేదని.. ఈ పరిస్థితిని గమనించి జగన్ ఎన్ డి ఏ కు ప్లేట్ ఫిరాయించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. తను జైలుకు వెళ్లకుండా ఉండడానికి రెండు పడవల ప్రయాణం చేస్తున్నారని టిడిపి నేతలు దుయ్యబడుతున్నారు.