Jagan supports NDA: వైయస్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) సంక్లిష్ట పరిస్థితి ఎదురయింది. జాతీయస్థాయిలో ఏదో ఒక పక్షం వైపు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఆయనది. బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కొనసాగుతోంది. అధికారపక్షంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఇప్పుడిప్పుడే బలపడుతోంది. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ గట్టిగానే ఫైట్ చేస్తుండడంతో.. జాతీయస్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి బలపడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఖరారయ్యారు. అటు ఇండియా కూటమి సైతం బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాము బలపరిచిన అభ్యర్థి గెలుపునకు వ్యూహం రూపొందిస్తోంది. అందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు ఆయన.
టిడిపి కీలక భాగస్వామి..
ప్రస్తుతం ఎన్డీఏలో( National democratic alliance) కీలక భాగస్వామి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. బిజెపి పెద్దలు గౌరవంతో చూసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమిలో బిజెపి ఉంది. ఆ కూటమికి రాజకీయ ప్రత్యర్థిగా జగన్ ఉన్నారు. అయితే జాతీయస్థాయిలో బిజెపి తన అవసరాల దృష్ట్యా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరింది. అయితే చంద్రబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అన్న డిఫెన్స్ లో ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి ది.
ఏకగ్రీవ ఎంపికకు..
అయితే వీలైనంతవరకు ఉపరాష్ట్రపతి( Indian vice president) ఎంపికను ఏకగ్రీవం చేయాలని బిజెపి హై కమాండ్ భావిస్తోంది. అందులో భాగంగానే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపే బాధ్యతను రాజ్ నాథ్ సింగ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గురించి వివరించారు. ఏకగ్రీవం అయ్యేలా మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: అమరావతికి వరద.. ఆ ప్రచారంలో నిజం ఎంత?
గతంలో అధికార పార్టీకి మద్దతు..
అయితే రాష్ట్రపతి తో పాటు ఉపరాష్ట్రపతి వంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీకి జై కొట్టారు. వైసిపి ఆవిర్భవించిన తర్వాత 2012లో రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రణబ్ ముఖర్జీకి( Pranab Mukherjee ) మద్దతు తెలిపారు జగన్మోహన్ రెడ్డి. 2017లో ఎన్డీఏ బలపరిచిన రామ్నాథ్ కోవింద్ కు మద్దతు ప్రకటించారు జగన్. 2022లో ఎన్డీఏ బలపరిచిన ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఒక పరిస్థితి కానీ.. ఈ ఎన్నికల్లో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయంగా తనను ఆదుకునే పరిస్థితిలో బిజెపి లేదు. పోనీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతామంటే.. కాంగ్రెస్ పార్టీతో ఉన్న వైరం ఒకవైపు.. కేసులు తెరపైకి వస్తాయన్న భయం మరోవైపు జగన్మోహన్ రెడ్డికి వెంటాడుతున్నాయి. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.