Dharmana Prasad Rao : ఏపీలో సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. బయటకు కనిపించడం లేదు. ఇంటికి పరిమితం అవుతున్నారు. వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. చివరకు తనకు ఇష్టమైన రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సైతం ముఖం చాటేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ చేసే రివ్యూలకు హాజరు కావడం లేదు. కేవలం వ్యక్తిగత పని మీద వచ్చే కార్యకర్తలకు మాత్రమే పలకరిస్తున్నారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడు అంటూ ఎవరూ లేరు. ఈ తరుణంలో వైసీపీ నాయకత్వం అప్రమత్తం అయ్యింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిని నియమించడానికి సిద్ధపడుతోంది. అయితే ఇదివరకే శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలసలో కొత్త ఇన్చార్జిని నియమించారు జగన్. 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు తమ్మినేని. కానీ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీ స్పీకర్ కూడా అయ్యారు. ఈ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసిన తమ్మినేని కి ఓటమి తప్పలేదు. అయితే ఆమదాలవలసలో విపరీతమైన వర్గ పోరు ఉంది. పైగా తమ్మినేని పై పోటీ చేసి గెలిచిన కూన రవికుమార్ సీతారాం కు స్వయానా మేనల్లుడు. అక్కడ కుటుంబ రాజకీయాలతో వైసిపి నష్టపోతుందని భావించిన జగన్ తమ్మినేనిని ఇంచార్జ్ పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో యువకుడైన చింతాడ రవికుమార్ కు అవకాశం ఇచ్చారు. అందుకే ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు పై దృష్టి పెట్టారు జగన్. పార్టీలో ఇష్టం ఉంటే ఉండండి.. లేకుంటే ఇన్చార్జిగాఎవరిని నియమించాలో చెప్పండి అంటూ జగన్ ఆదేశించినట్లు సమాచారం.
* దారుణ పరాజయంతో
ఈ ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు దారుణంగా ఓడిపోయారు. టిడిపి ఓ సర్పంచ్ ను రంగంలోకి దించింది. అయినా సరే ధర్మానపై టిడిపి అభ్యర్థి శంకర్ 52 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. శ్రీకాకుళం జిల్లాలోనే ఇది అత్యధిక మెజారిటీ. దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు ధర్మాన ప్రసాదరావు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో తాను తప్పుకొని కుమారుడికి అవకాశం ఇవ్వాలని భావించారు. కానీ జగన్ అందుకు ఒప్పుకోలేదు. అందుకే తన కుమారుడికి పొలిటికల్ లైఫ్ ఇచ్చే పార్టీలో చేరాలని భావిస్తున్నారు. ఒకానొక సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని టాక్ నడిచింది. కానీ అలా జరగలేదు. ఆయన వైసీపీలో యాక్టివ్ కావడం లేదు. అలాగని ఇతర పార్టీల్లో చేరడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు.
* ధర్మానకు సజ్జల ఫోన్
అయితే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం అసెంబ్లీ సీటు పై దృష్టిపెట్టారు. పార్టీలో యాక్టివ్ కావాలని ధర్మాన ప్రసాదరావుకు సూచించారు. లేకుంటే మీరు తప్పుకుని ఇన్చార్జిగా ఎవరి పేరునైనా ప్రతిపాదించాలని కోరారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల ధర్మానకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మీకు ఆసక్తి ఉంటే కొనసాగాలని.. లేకుంటే వేరే ఎవరినైనా ఇన్చార్జిగా ప్రతిపాదించాలని కోరినట్లు సమాచారం. అయితే ఇందుకు ధర్మాన ప్రసాదరావు కొంత సమయాన్ని కోరినట్లు తెలుస్తోంది.