Jagan: ఏపీ అసెంబ్లీ పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. 11 వరకు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి. ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారంతో ముందుకు వెళ్తున్నాయి. గత ఎన్నికల్లో వైసిపి సూపర్ విక్టరీ సాధించింది. దాన్ని మరోసారి రిపీట్ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. మరోవైపు ఎలాగైనా జగన్ ను అధికారం నుంచి దూరం చేయాలని విపక్షాలన్నీ కూటమికట్టాయి. అటు బిజెపి సైతం ఆ కూటమిలో చేరింది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ తరుణంలో హోరాహోరీ ఫైట్ నెలకొంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ జాతీయ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో చాలా విషయాలపై స్పష్టతనిచ్చారు. గత ఐదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. తన 16 నెలల జైలు జీవితం, దానికి గల కారణాలు, వెనుక ఉన్న పార్టీల విషయాన్ని ప్రస్తావించారు. అటు సోదరి షర్మిల ప్రస్తావన సైతం ఇంటర్వ్యూలో వచ్చింది. వాటన్నింటికి జగన్ ఓపికగా సమాధానం చెప్పారు.ప్రస్తుతానికి కేంద్రంలో తాము ఏ ప్రభుత్వానికి మద్దతు తెలపలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మద్దతిస్తాం కానీ… వ్యక్తిగత అంశాల విషయంలో మద్దతు ఇవ్వమని ఫెయిల్ చేశారు. ప్రస్తుతానికి న్యూట్రల్ గా ఉన్నామని.. కేంద్రంలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
అయితే ఒక విషయంలో మాత్రం ప్రధాని మోడీకి బాహటంగానే మద్దతు తెలుపుతామని జగన్ స్పష్టం చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ విషయంలో సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తేల్చి చెప్పారు. అయితే మైనారిటీల విషయంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. గతంలో తాను కాంగ్రెస్ లో కొనసాగానని.. కానీ ఆ పార్టీ నాయకులే తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ పై కూడా జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని అనుకోవట్లేదని అభిప్రాయాన్ని వెల్లడించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది ప్రజల చేతుల్లో ఉందని చెప్పుకొచ్చారు. అక్రమాస్తుల కేసుల్లో కాంగ్రెస్ వెనుక చంద్రబాబు ఉన్నారని.. తన తండ్రి పేరును సైతం చార్జ్ షీట్లో పెట్టారని విమర్శించారు. అకారణంగానే తాను 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్ షర్మిల విషయంలో చంద్రబాబు డర్టీ గేమ్స్ ఆడిస్తున్నారని.. కుటుంబంలో చీలిక రావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉందని జగన్ అనుమానిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి ప్రాంతీయ పార్టీ అని.. తాను చిన్నవాడినని.. పార్టీని నడిపేందుకు తనకు వయసు ఉందని.. వైసీపీకి ప్రస్తుతం వారసత్వం అవసరం లేదని షర్మిల విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు జగన్ ఇలా స్పందిస్తూ వ్యాఖ్యలు చేయడం విశేషం. మొత్తానికైతే జగన్ స్థానిక మీడియాకు అవకాశం ఇవ్వకపోయినా.. ఇప్పుడు ఎన్నికల ముంగిట నేషనల్ మీడియా ద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయడం గమనార్హం.