Ex minister gudivada amarnath : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అసంతృప్తితో ఉన్నారా? అందుకే పార్టీ కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారా? అధినేత తీరుపై ఆగ్రహంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గుడివాడ అమర్నాథ్ తాజా మాజీ మంత్రి. ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశారు. దారుణంగా ఓడిపోయారు. ఆయనపై పల్లా శ్రీనివాస్ యాదవ్ 95 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. అనూహ్యంగా టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. అయితే భారీ ఓటమి ఎదురైనా.. గుడివాడ అమర్నాథ్ ఫలితాలు వచ్చిన మూడో రోజుకు అలెర్ట్ అయ్యారు.మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా విశాఖ వైసిపి కార్యాలయాన్ని నిర్మించారంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దానిపై కూడా గుడివాడ అమర్నాథ్ గట్టిగానే మాట్లాడారు. రాష్ట్రంలో తాజా మాజీ మంత్రులు సైలెంట్ అయినా అమర్నాథ్ మాత్రం గట్టిగానే వాయిస్ వినిపించారు. అయితే ఉన్నట్టుండి గుడివాడ అమర్నాథ్ సైలెంట్ అయ్యారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటన తరువాతే గుడివాడ అమర్నాథ్ సైలెంట్ కావడం విశేషం.ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని గుడివాడ అమర్నాథ్ భావించారు. విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో.. గెలుపు ఖాయమని భావించారు. కానీ అధినేత జగన్ మాత్రం బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు. దీంతో అమర్నాథ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ కార్యక్రమాల హాజరును కూడా తగ్గించారు. మీడియా ముందు కూడా కనిపించడం మానేశారు.
* ఆది నుంచి జగన్ వెంటే
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన గుడివాడ అమర్నాథ్ వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం కేటాయించారు జగన్. ఆ ఎన్నికల్లో అమర్నాథ్ ఓడిపోయారు. కానీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని కేటాయించారు. 2019లో అనకాపల్లి అసెంబ్లీ టికెట్ను అమర్నాథ్ కి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలవడంతో ఎంతో ప్రాధాన్యమిస్తూ వచ్చారు. విస్తరణలో మంత్రి పదవి కేటాయించారు. కీలక అయిదు శాఖలను కట్టబెట్టారు. ఎన్నికల్లో అనకాపల్లి నుంచి తప్పించారు. చివరి నిమిషంలో గాజువాక కేటాయించారు. అయినా ఓటమి తప్పలేదు.
* సోషల్ మీడియాలో ట్రోల్
గుడ్డు మంత్రిగా ప్రాచుర్యం పొందారు గుడివాడ అమర్నాథ్. ఆయన వ్యవహార శైలి వింతగా ఉండేది. కామెంట్స్ భిన్నంగా ఉండేవి. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయ్యారు. ఒకానొక దశలో ఆయనకు టిక్కెట్ ఇవ్వరని భావించారు. కానీ జగన్ కు నమ్మిన బంటు కావడంతో చివరి నిమిషంలో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆయన విశాఖలో పార్టీని గట్టెక్కించలేకపోయారు. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇదే గుడివాడ అమర్నాథ్ కు మైనస్ గా మారింది.
* ఎమ్మెల్సీగా ఆశ
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే గెలుస్తానని అమర్నాథ్ భావించారు. తద్వారా 2029 వరకు పెద్దల సభలో ఉండొచ్చని అంచనా వేశారు. జగన్ మాత్రం ఆ చాన్స్ ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కు అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి సైలెంట్ అయిపోయారు గుడివాడ అమర్నాథ్. ఇకనుంచి బొత్స కు పట్టు పెరుగుతుందని.. విశాఖలో ఆయన నాయకత్వం కింద పని చేయాల్సి ఉంటుందని అమర్నాథ్ భావిస్తున్నారు. అందుకే బొత్స ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.