YS Jagan – YS Sharmila : ఇడుపులపాయకు వైఎస్ కుటుంబానికి విడదీయరాని బంధం. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబానికి ఒక ఆలయం లాంటిది. సగటు వైఎస్ అభిమాని గుండెల్లో కొలువై ఉంటుంది. నిత్యం జనతాకిడితో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. వైఎస్ జయంతి, వర్ధంతి నాడు నిండైన మనసుతో నివాళులర్పిస్తుంటారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబం మొత్తం ఐక్యంగా వచ్చి నివాళులర్పిస్తుంటుంది. కానీ ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ కుమారుడు, కుమార్తె వైరుధ్యమైన రాజకీయ నిర్ణయాలతో ముందుకు సాగుతుండడమే అందుకు కారణం.
వైఎస్ కుమారుడు జగన్ ఏపీ సీఎంగా ఉన్నారు. తండ్రి అకాల మరణం తరువాత కాంగ్రెస్ పార్టీని వీడారు. సోనియా గాంధీకి ఎదురెళ్లి కేసులబారిన పడ్డారు. జైలు జీవితం కూడా అనుభవించారు. వైసీపీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. 2014లో ప్రతిపక్ష పాత్ర పోషించి.. 2019లో అధికారంలోకి రాగలిగారు. తనను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీపై రివేంజ్ తీర్చుకున్నారు. ఆ పార్టీని ఏపీలో నామరూపాలు లేకుండా చేశారు. కానీ తన విజయానికి కారణమైన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళను దూరం చేసుకున్నారు.
రాజశేఖర్ రెడ్డి తనయగా షర్మిళ తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని తలపోశారు. రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని స్థాపించారు. గట్టిగానే పోరాడారు. కానీ రాజకీయంగా పెద్దగా గుర్తింపు సాధించలేకపోయారు. అందుకే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నాడు తన సోదరుడు విభేదించిన కాంగ్రెస్ తో చెలిమికి ఆమె ముందుకొచ్చారు. తన తండ్రి మాదిరిగా కాంగ్రెస్ లో రాణించేందుకే ఆమె సిద్ధమైనట్టు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
జగన్ కాంగ్రెస్ బద్ధ విరోధిగా ఉండగా… షర్మిళ అదే పార్టీలోకి వెళతానని సంకేతాలు పంపుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామ క్రమంలో ఈ నెల 8న వైఎస్సార్ జయంతి నాడు ఇడుపులపాయలో కుటుంబమంతా కలవనుంది. ఇప్పటికే జగన్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. 8 నుంచి పదో తేదీ వరకూ ఆయన కడప జిల్లాలో గడపనున్నారు. కుటుంబంలో మారిన పరిణామాల నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఇడుపులపాయపైనే ఉంది. అన్నా-చెల్లెలు తండ్రికి కలిసి నివాళులర్పిస్తారా? లేకుంటే వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించి తమ మధ్య రాజకీయ వైరం ఉందని సంకేతాలు పంపిస్తారా? అన్నది చూడాలి.