Jagan IPAC: బీహార్ ఫలితం( Bihar election result) దేశంలో చాలా రాజకీయ పార్టీలకు ఒక సంకేతాలు ఇచ్చినట్లు అయింది. అక్కడ బిజెపి, జెడియు గెలుపు.. ఆర్జెడి, కాంగ్రెస్ ఓటమిని పక్కన పెడితే.. ప్రశాంత్ కిషోర్ ఓడిపోయిన తీరుతోనే దేశం యావత్తు ఆసక్తిగా చూసింది. ఈ ప్రశాంత్ కిషోర్ యేనా ఇప్పటివరకు రాజకీయ పార్టీలను గెలిపించింది? అంటూ విశ్లేషించే దాకా పరిస్థితి వచ్చింది. అయితే రాజకీయ వ్యూహకర్తలంటే కొంచెం సాంకేతికతను జోడించి.. రాజకీయ వ్యూహాలు చేయడమా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ ప్రవేశంతోనే రాజకీయ వ్యూహకర్తల శకం ప్రారంభం అయింది. ఇప్పుడు ఆయన ఓటమితోనే అదే రాజకీయ వ్యూహకర్తల ముగింపు మొదలవుతుందని అంచనాలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ టీం సేవలకు స్వస్తి పలకనున్నట్లు సమాచారం. గతంలో ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీంకు సారథ్యం వహించగా.. ఆయన బీహార్ ఎన్నికల వైపు వెళ్లడంతో ఆ బాధ్యతలను రుషిరాజ్ సింగ్ చూసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఓటమితో వ్యూహకర్తలకు వందల కోట్ల రూపాయలు అనవసరంగా పోశామన్న బెంగ వైసీపీ నాయకత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది.
విపరీతమైన సానుభూతి..
2017లో జగన్మోహన్ రెడ్డి( Y.S Jagan Mohan Reddy ) పాదయాత్ర చేసే సమయంలో ప్రశాంత్ కిషోర్ వైసిపి వ్యూహకర్తగా నియమింపబడ్డారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ఆదరణ ఉండేది. ప్రజల్లో విపరీతమైన సానుభూతి కూడా ఉండేది. ఆ పై ఒక్కసారి ఓడిపోయారన్న సానుభూతి కూడా ప్రజల్లో మిక్కిలిగా ఉండేది. ఆ సమయంలో పాదయాత్ర చేస్తే జనాదరణ విపరీతంగా వచ్చింది. దానికి ప్రశాంత్ కిషోర్ టీం పబ్లిసిటీ తోడైంది. అది మొదలు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బాగానే పనిచేసాయి. ఆయన సొంత రాష్ట్రం లో రాజకీయాలు చేసేందుకు వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్నారు.రుషిరాజ్ సింగ్ కు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. అయితే ఐదేళ్లపాటు వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ టీం పట్ల పూర్తి నమ్మకం పెట్టుకున్నారు జగన్. వారిచ్చిన నివేదికలనే నమ్ముకున్నారు. పార్టీ నేతలు వద్దని వారించినా వినలేదు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడిందట.
ఆయన వచ్చినా ఇదే ఫలితం..
అయితే ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) లేకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో ఓటమి అని అంతా భావించారు. దీనికి తోడు ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు ఇంటికి వచ్చి విందు కూడా చేశారు. ఆయన ఇచ్చిన సలహాలతోనే ముందుకెళ్లడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని టిడిపి శ్రేణులు అంచ నాకు వచ్చాయి. అయితే బీహార్లో ఆయన ఓడిపోవడంతో ఇప్పుడు తెలుగు రాజకీయ పార్టీల్లో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. పార్టీలకు ప్రజాభిమానం ఉంటే గెలుపు.. ప్రజా వ్యతిరేకత ఉంటే ఓటమి ఖాయమని.. అనవసరంగా వ్యూహకర్తల చేతుల్లో వందల కోట్లు పెట్టి చేతులు కాల్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదని నేతలు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్న.. తెలుగుదేశం పార్టీకి పీకే సలహాలు లేకపోయినా ఫలితం అలానే వచ్చేదట. ఎంతటి ప్రశాంత్ కిషోర్ అయినా ప్రజల మనసును మార్చలేరు కదా. కేవలం వ్యూహకర్త అంటే ఏవేవో లెక్కలు చెప్పడమే తప్పించి మరొకటి కాదన్న అభిప్రాయం కూడా ఉంది.