Jagan: స్పీకర్ అయ్యన్నకు జగన్ సంచలన లేఖ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి దారుణ ఫలితాలు వచ్చాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో మాత్రమే వైసిపి విజయం సాధించింది.

Written By: Dharma, Updated On : June 25, 2024 5:36 pm

Jagan

Follow us on

Jagan: ఏపీలో వైసిపి ఘోర పరాజయం పాలయ్యింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అందుకే ఆ పార్టీ తీవ్ర అవమాన భారంతో జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. సభా సంప్రదాయాలను కూడా పట్టించుకోవడం లేదు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంపికను కూడా డుమ్మా కొట్టారు. గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న మాట ఇది. ప్రతిపక్ష పాత్ర కూడా జగన్ పోషించలేదని అధికార పక్షం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పందించారు వైసీపీ అధినేత జగన్. నేరుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి లేఖ రాశారు. సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో తాను ఎందుకు అలా ప్రవర్తించింది వివరించే ప్రయత్నం చేశారు. తాను స్పీకర్ ఎన్నికకు ఎందుకు హాజరు కాలేదు? అందుకు గల కారణాలను విశ్లేషించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి దారుణ ఫలితాలు వచ్చాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో మాత్రమే వైసిపి విజయం సాధించింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే వైసీపీకి కనీసం 18 అసెంబ్లీ స్థానాలు అవసరం. కానీ ప్రజలు వైసీపీని తిరస్కరించారు. అయితే ఓట్ల పరంగా మాత్రం వైసిపి మెరుగైన స్థానంలోనే ఉంది. ఆ పార్టీకి 40 శాతం ఓట్లు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కోటి 32 లక్షల మంది ఓటర్లు వైసీపీకి జై కొట్టారు. కానీ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడం దురదృష్టకరం. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా విషయంలో అసెంబ్లీ స్పీకర్ కు విచక్షణ అధికారం ఉంది. స్పీకర్ తలచుకుంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. కానీ ఆ పార్టీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రున్ని స్పీకర్ గా ఎంపిక చేసింది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందని ఆ పార్టీ నమ్మకం కోల్పోయింది. అయ్యన్నపాత్రుడు వ్యవహార శైలి తెలిసి.. అసెంబ్లీలో తమ పాత్ర పై ఒక నిర్ణయానికి వచ్చింది.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసిపి ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 102 స్థానాల్లో విజయం సాధించింది. వైసిపి 67 స్థానాల్లో గెలుపొందింది. టిడిపి మిత్రపక్షంగా ఉన్న బిజెపి 6 స్థానాల్లో విజయం సాధించింది. అయితే నాడు చంద్రబాబు సర్కార్ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ను స్పీకర్ గా ఎంపిక చేసింది. కోడెల వ్యవహార శైలి పై ఎన్నో రకాల అభ్యంతరాలు ఉన్నా.. సభాపతిగా వైసిపి అధినేత జగన్ తన ఆమోదాన్ని తెలిపారు. గౌరవంగా నాడు కోడెలను స్పీకర్ పీఠంపై కూర్చోబెట్టారు. అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు కోడెల శివప్రసాదరావు. నాడు అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా అవమానపరిచారు. అందుకే జగన్ శాసనసభను బాయ్ కట్ చేశారు. తొలి నాళ్లలో అసెంబ్లీకి హాజరైనా.. తరువాత ముఖం చాటేశారు.

ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ ఓటమి చవిచూసింది. దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అవమాన భారంతో జగన్ ఉండగా.. ఓ సీనియర్ నేతగా చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసిపి చనిపోలేదని.. జగన్ ఇంకా నిర్వీర్యం కాలేదని.. ఆ పార్టీని ఇంకా పాతాళంలో తొక్కకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సర్కారులో మంత్రి పదవి ఆశించి అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ చంద్రబాబు క్యాబినెట్లో అయ్యన్నపాత్రుడు కి చోటు దక్కలేదు. అనూహ్యంగా పదవులను ఎంపిక చేసే భాగంలో అయ్యన్నపాత్రుడుకు స్పీకర్ పదవి దక్కింది. అయితే వైసీపీని అంత ముందిస్తేనే అన్న వ్యాఖ్యలు గుర్తు చేస్తూ జగన్.. ఆయన పేరును స్పీకర్ పదవికి పరిగణలోకి తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక సీనియర్ నేతగా ఆయన కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే స్పీకర్ ఎంపికకు జగన్ దూరమయ్యారు. అంతే తప్ప తనకు ప్రజాస్వామ్య వ్యవస్థ పై అంచలంచెలుగా గౌరవం ఉందని.. స్పీకర్ ఎంపికకు తాను గైర్హాజరు కావడానికి అయ్యన్నపాత్రుడు వ్యవహార శైలి కారణమని చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై లేఖ రాశారు. అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికైన అయ్యన్నపాత్రుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వరని భావించి తాను స్పీకర్ ఎంపిక కార్యక్రమానికి గైర్హాజరయ్యానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వైరల్ అవుతోంది.