Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారా? ఉప ఎన్నికలకు వెళ్తారా? అసలు ఆ పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం చేస్తారా? రాజీనామా చేసిన స్థానాలన్నీ గెలవగలరా? కూటమికి ఎదురొడ్డి నిలవగలరా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరుపై రకరకాల చర్చ నడుస్తోంది. హాజరు కాకుంటే అనర్హత వేటు పడుతుందని హెచ్చరికలు వచ్చాయి. దీనిపై స్పందించిన జగన్ పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలోనే.. అవసరమైతే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్దామని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో దసరా తరువాత ఏ క్షణం అయినా జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: మతిమరుపులో రోహిత్ ను దించేసిన సూర్య.. ప్లేయింగ్ 11 ను మరిచిపోయాడు.. వైరల్ వీడియో
* పులివెందులపై అనుమానం..
ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు గెలవగలదా? అనేది ఇప్పుడు ప్రశ్న. ముఖ్యంగా పులివెందులపై( pulivendula) అనుమానపు చూపులు ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. పులివెందుల అంటేనే వైయస్సార్ కుటుంబానికి పెట్టని కోట. మండలంలో పదివేల ఓట్లు ఉంటే కేవలం 600 ఓట్లు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లభించాయి. పోనీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తోంది. అంటే పులివెందుల ప్రజలను ప్రలోభ పెట్టినట్లు చెబుతోంది. అయితే ప్రజల ఆమోదం లేకుండా ఇది సాధ్యమా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ప్రజలు లేకుండా, పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లు వెళ్లకుండా కూటమి పార్టీల నేతలు వెళ్లి ఏకపక్షంగా ఓటు వేశారా? అది సాధ్యం కాదు కూడా. అయితే వైసీపీ మాత్రం అధికార దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తోంది. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా నడిచే నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉందంటే.. ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీ ఊరుకుంటుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. పైగా కేంద్రం దన్ను ఉంది. చేతిలో అధికారం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ అనుమానం ఉంటే.. రాజీనామా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడగలరా? అనేది ఇప్పుడు ప్రశ్న.
* అప్పట్లో సంచలనమే..
2012లో వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. తన వెంట వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉప ఎన్నికలకు వెళ్లారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి నిలిచారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. అయినా సరే ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కానీ దాని వెనుక సెంటిమెంట్ అస్త్రం ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో విపరీతమైన సింపతి ఉండేది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసుల్లో ఇరికించిందని ప్రజలు బలంగా భావించారు. అందుకే ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా.. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినా ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఆదరించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉందా? అటువంటి సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తుందా? అంటే మాత్రం అనుమానమే. అందుకే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేసే సాహసం చేయరని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అయితే దసరా తర్వాత సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయని మాత్రం ప్రచారం సాగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.