Jagan: విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. విద్యార్థుల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ స్థాయిలో ఉద్యోగ, ఉపాధికి అవకాశం ఉన్న కోర్సులు, అత్యుత్తమ యూనివర్సిటీల సర్టిఫికెట్ కోర్సులను ఉచితంగా అందించనుంది. ఏటా డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ పూర్తి చేసే వేలాదిమంది విద్యార్థులు.. ఉద్యోగ, ఉపాధి కోసం మిగతా కోర్సులను పూర్తి చేయాల్సి వస్తోంది. ఇందుకుగాను సమయంతో పాటు కొంత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఈ కోర్సులు అందించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యార్థులపై అదనపు భారం పడకుండా చూడాలని భావిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
అటు డిగ్రీ తో పాటు ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పుడే ఆన్లైన్లో ఎడెక్స్ సంస్థ బోధన సాగించనుంది. హార్వర్డ్, ఎం టి ఐ ఆక్స్ఫర్డ్, కేం బ్రిడ్జ్ సహా పలు ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లను విద్యార్థులకు అందించనున్నారు. శాస్త్ర సాంకేతిక, సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ రకాల సబ్జెక్టులుఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయి. మనదేశంలో లభ్యం కానీ ఎన్నో కోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులే కాదు.. ఆర్ట్స్, కామర్స్ లో పలు రకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అంతిమంగా విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 12 లక్షల మందికి ఆన్లైన్లో ఎడెక్స్ సంస్థ ప్రత్యేక కోర్సులను అందించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలటిక్స్, వర్చువల్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటర్ శిక్షణ ఇచ్చేలా ఇడెక్స్ సంస్థతో జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. నామినేషన్ ప్రాతిపదికన ఈ సంస్థకు ఏపీ సర్కార్ చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. ఈ ఒప్పందానికి సంబంధించి ఏపీ ఉన్నత విద్యా మండలి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. అయితే ఈ ఆన్లైన్ కోర్సులను సక్రమంగా వినియోగించుకుంటే ఏపీలో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.