YS Jagan Sakshi Media: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా లాభం కంటే నష్టం అధికమని ఎక్కువమంది వాదిస్తున్నారు. చివరకు ఆ మీడియాలో కనిపించే విశ్లేషకులు, జర్నలిస్టులు సైతం అదే మాట చెబుతున్నారు. సాక్షి మీడియాలో డిబేట్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది కేఎస్ ప్రసాద్, పాషా అనే జర్నలిస్టులు. అయితే గత కొద్ది రోజులుగా ఆ ఇద్దరూ సాక్షి మీడియాలో కనిపించడం లేదు. పైగా సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసి పరస్పరం ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాక్షి పైనే వారు సెటైర్లు వేస్తున్నారు.. కె ఎస్ ప్రసాద్ ఒక అడుగు ముందుకు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా మైనస్ అంటూ తేల్చేశారు. సాక్షి ఛానల్ ను తపాలా ఛానల్ తో పోల్చారు.
* నిత్యం ఆ వార్తల కవరేజ్..
అయితే విమర్శలను పక్కన పెడితే సాక్షి మీడియా వ్యవహార శైలి కూడా అలానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి కి వచ్చే క్రమంలో… గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే భారీ జన సమీకరణ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ మంది స్వాగతం పలుకుతారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. దానిని విస్తృతంగా కవర్ చేస్తూ ఉంటుంది సాక్షి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లే క్రమంలో కూడా ఎయిర్పోర్టులో జనరద్దిని చూపిస్తూ ఉంటుంది సాక్షి. తద్వారా జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎక్కువగా ఉండడం లేదని.. పక్క రాష్ట్రంలో ఉంటున్నారని ప్రజలకు తెలియజేస్తోంది సాక్షి. ఒక్క జగన్మోహన్ రెడ్డి పర్యటనలే కాదు. చాలా విషయాల్లో సాక్షి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్. మొన్న మధ్యన ఉద్యోగ సంఘాల ఆందోళన క్రమంలో.. కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సంఘాల నేతల ఫోటోలతో అభిప్రాయాలను ప్రచురించారు సాక్షిలో. దీంతో మిగతా సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు చిన్న బుచ్చుకున్నారు.
* వారు హైదరాబాద్ వెళుతున్నా..
ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాదులో తమ నివాసాలకు వెళ్తుంటారు. కనీసం వారు ఎప్పుడు వెళ్తుంటారో తెలియదు. ఎప్పుడు వస్తుంటారో తెలియదు. వారి విషయంలో ఎటువంటి హైలెట్స్ ఉండవు. వచ్చి వెళ్లే క్రమంలో జన సమీకరణలు, ఆత్మీయ స్వాగత కార్యక్రమాలు ఏమీ ఉండవు. వారు హైదరాబాదులో ఉన్న అమరావతి పేరుతోనే మీడియాలో వార్తలు వస్తుంటాయి. అయితే దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నిత్యం జగన్మోహన్ రెడ్డిని చూపించే క్రమంలో అడ్డగోలుగా వ్యవహరించి అడ్డంగా బుక్ అవుతుంటోంది సాక్షి మీడియా.
