Sajjala Bharghav Reddy : సజ్జలపై వేటు.. జగన్ సంచలన నిర్ణయం!

గత ఐదేళ్ల వైసిపి పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి చాలా యాక్టివ్ గా పని చేశారు. ప్రభుత్వంతోపాటు పార్టీలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఆయన కుమారుడుసోషల్ మీడియా బాధ్యతలు చూశారు.అయితే ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ ఓటమితో తండ్రి కొడుకుల పై పార్టీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Written By: Dharma, Updated On : October 5, 2024 3:40 pm

Sajjala Bharghav Reddy

Follow us on

Sajjala Bharghav Reddy : జగన్ దూకుడుగా ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన పార్టీకి దారుణ ఓటమి ఎదురైంది. ఓటమి నుంచి చేరుకోవడానికి ఆ పార్టీకి నాలుగు నెలల వ్యవధి పట్టింది. ఇప్పుడిప్పుడే అధినేత జగన్ తో పాటు కొంతమంది నేతలు పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. అయితే పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న నేతలు బయటపడుతున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి కేసులు, దాడులు తప్పవని భావిస్తున్న వారు సైలెంట్ అవుతున్నారు.పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు బయటకు వెళ్తున్నారు. పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇటువంటి సమయంలో జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారి గురించి పట్టించుకోవడం లేదు. ఉన్నవారితో రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ బాధ్యులను మార్చుతున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు.

* అంజి రెడ్డికి బాధ్యతలు
తాజాగా పార్టీ సోషల్ మీడియా బాధ్యతను దొడ్డి అంజిరెడ్డికి అప్పగించారు. ఇప్పటివరకు సోషల్ మీడియా బాధ్యతలను సజ్జల భార్గవ్ రెడ్డి చూసేవారు. ఈయన పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు. ఈ ఎన్నికల్లో పార్టీకి ఓటమి ఎదురైన తర్వాత వైసీపీ శ్రేణులు సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు ఆయన కుమారుడు తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. చాలామంది బాహటంగానే సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరిని విమర్శించారు. సజ్జల తీరుతోనే పార్టీకి నష్టం ఎదురైందని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డి తీరుపై కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఎన్నికల అయిన వెంటనే ఆయనను తప్పిస్తారని పెద్ద ప్రచారం నడిచింది. ఎట్టకాలకు భార్గవ్ రెడ్డి స్థానంలో కొత్తగా అంజిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు జగన్.

* ప్రారంభంలో విజయసాయిరెడ్డి
వైసిపి ఆవిర్భావం నుంచి సోషల్ మీడియా విభాగం బాధ్యతలను విజయసాయిరెడ్డి చూసేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ సోషల్ మీడియా విభాగం.. ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం తో సమన్వయంతో పనిచేసింది. వైసీపీ అధికారంలోకి రావడానికి ఒక కారణంగా నిలిచింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని పక్కకు తప్పించారు. భార్గవ రెడ్డికి తెరపైకి తెచ్చారు. అయితే గత ఐదేళ్లగా ఆశించిన స్థాయిలో భార్గవరెడ్డి పనిచేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అటు పార్టీలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి పై కూడా సీనియర్లు గుర్రుగా ఉన్నారు. పార్టీ ఓటమి తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు ఆయనను ఏకంగా తప్పించి కొత్త వ్యక్తికి ఆ బాధ్యతలో అప్పగించారు జగన్. దీంతో పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా తగ్గనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.