https://oktelugu.com/

Pawan Kalyan: సోషలిస్టు నుంచి సనాతనధర్మ పరిరక్షకుడిగా.. దశాబ్దంలో మారిన పవన్‌ రాజకీయ పరిణామం!

పవన్‌ కళ్యాణ్‌.. ముందుగా అందరికీ సినీ నటుడిగానే తెలుసు. కానీ, రాజకీయాల్లో దశాబ్దకాల పోరాటం తర్వాత ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాడు. సోషలిస్టుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జనసేనాని ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా మారాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 5, 2024 / 03:44 PM IST

    Pawan Kalyan(21)

    Follow us on

    Pawan Kalyan: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. సినిమాలతో యూత్‌లో మహా క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు. జనసేన పార్టీ అధినేతగా రాజకీయాల్లో అడుగు పెట్టారు. అంతకు ముంద తన అన్న మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజార్యాం పార్టీలో చేరి.. యువరాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా పనిచేశాడు. దూకుడుతనం, ఆవేశం ప్రదేశించే పవన్‌ కల్యాణ్‌ ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత 2014లో జనసేన పార్టీని స్థాపించారు. పూర్తిగా సోషలిస్టు భావాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. చెగువెరా వారసునిగా ప్రచారం చేసుకున్నారు. బ్రెజిల్‌కు చెందిన చెగువెరా.. అనేక రెవల్యూషనరీలో పాల్గొన్నారు. క్యూబా మంత్రిగా పనిచేశారు. ఆయన యూత్‌ ఐకాన్‌. అమెరికా కాల్పుల్లో చనిపోయాడు. కానీ అమెరికా ఫొటోగ్రాఫర్‌ తీసిన చెగువెరా ఫొటో ఇప్పటికీ చాలా మంది తమలో స్ఫూర్తి నింపుకునేందుకు వాడుకుంటారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా మొదట్లో చెగువెరా స్టైల్‌ను ఫాలో అయ్యాడు. దూకుడుగా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక పాలకులపై తిరగబడే నేతగా గుర్తింపు పొందారు. పార్టీ స్థాపించిన సమయంలో తన వేదికపై పూలే, కాన్షీరామ్, చెగువెరా లాంటి ఫొటోలు ఉంచి ఆకట్టుకున్నాడు. తన భావాలు కమ్యూనిస్టు భావాలు అని ప్రకటించారు.

    బీజేపీ–టీడీపీ కూటమికి మద్దతు..
    అయితే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి కమ్యూనిస్టు భావాలు అని చెప్పి.. బీజేపీకి మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. అయితే.. తర్వాత తన పంథా మారుతుందని గుర్తించి.. టీడీపీ–బీజేపీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. లోకేశ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ విధానాలను తప్పు పట్టారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించారు. ఈ క్రమంలో కూటమికి దూరమయ్యారు.

    కమ్యూనిస్టులతో పొత్తు..
    ఇక 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో జనసేన, సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేశాయి. తద్వారా తనది కమ్యూనిస్టు భావజాలమని మరోమారు చెప్పారు. పవనిజం పేరుతో ఓ పుస్తకం కూడా విడుదల చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా కమ్యూనిస్టు నినాదాలు చేశారు. కానీ పెద్దగా ఫలితాలు రాలేదు. తర్వాత 2019 జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులతోపాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని తీసుకువచ్చి ప్రచారం చేయించారు. దేశానికి ప్రధాని కావాల్సిన దళిత నేత అని కీర్తించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేశాయి. జనసేన మాత్రం వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసింది. కానీ ఈ ఎన్నికలు కూడా నిరాశే మిగలింది. ఈ క్రమంలో వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం మొదలు పెట్టారు. అయితే ఎన్నికల తర్వాత బీఎస్పీ, వామపక్షాలతో తెగదెంపులు చేసుకున్నారు. మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. మోదీని కలుస్తూ.. బీజేపీ నిర్ణయాలకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో వైసీపీని ఓడించేందుకు టీడీపీతో మళ్లీ చేతులు కలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. కూటమిగా పోటీచేసి విజయం సాధించారు. 100 శాతం సక్సెస్‌ రేటులో పోటీ చేసిన 20 అసెంబ్లీ సీట్లు గెలిచారు. 2 ఎంపీ స్థానాలను గెలిపించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు.

    సనాతన ధర్మ పరిరక్షకుడిగా..
    ప్రస్తుతం పవన్‌ సనాతన ధర్మ పరిరక్షకుడిగా ప్రకటించుకున్నారు. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. అంతకు ముందు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. హిందువుల్లో ఐక్యత లేకపోవడంతోనే మన ధర్మాని, దేవుళ్లను అవమానిస్తున్నారని ఆరోపించారు. దీక్ష విరమణ తర్వాత కూడా తనకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదని, సనాతన ధర్మం పరిరక్షించబడాలన్నారు. తన ధర్మం జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని ప్రకటించారు. దీంతో పూర్తిగా హిందుత్వ వాదిగా మారిపోయారు. ఎన్నికలకు ముందు కూడా పూజలు, యజ్ఞాలు, హోమాలు, యాగాలు, పూజలు చేశారు.

    సనాతనధర్మ పోరాటం వెనుక..
    సనాతన ధర్మ పరిరక్షణకు పవన్‌ పోరాటం వెనుక ఉద్దేవం వేరే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమ్యూనిస్టు వాదిగా రాజకీయాల్లోకి వచ్చి.. ఇప్పుడు పూర్తిగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారడానికి కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఏపీలో, తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా మారడానికే పవన్‌ ఇలా సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్నారని పేర్కొంటున్నారు. దశాబ్ద రాజకీయ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అయిన పవన్‌.. మరో పదేళ్లలో ఏపీ సీఎం కావాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.