Jagan: వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో సీఎం అయ్యారు కొణిజేటి రోశయ్య. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ లీడర్ కూడా. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో గౌరవభావంతో చూసుకునేవారు. రోశయ్య ఎమ్మెల్సీగా ఉన్నా మంత్రివర్గంలోకి తీసుకొని ఆర్థిక శాఖ బాధ్యతలను ఇచ్చేవారు. రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు సీఎం అయినప్పుడు రోశయ్య మంత్రిగా వ్యవహరించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పదవి చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో పని చేసిన అనుభవం ఆయనది. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి ఓ నేతగా ఎదగడం అంత ఈజీ కాదు. కానీ రోశయ్య దానిని చేసి చూపించారు. అందుకే రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో రోశయ్యకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్. కానీ నాడు సీఎం పదవిని ఆశించారు జగన్. తన తండ్రి వారసత్వంగా తనను సీఎం చేయాలని కాంగ్రెస్ హై కమాండ్ కు డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియారిటీని గౌరవిస్తూ రోశయ్యను ఎంపిక చేసింది. కానీ రోశయ్య సీఎం పదవిలో ఉండగా సరిగా పని చేయనివ్వలేదు జగన్. ఎంతలా ఇబ్బంది పెట్టారో అంతలా పెట్టారు.చివరకు నాకు ఈ సీఎం పదవి వద్దు అంటూ రాజీనామా చేశారు రోశయ్య. అటు తరువాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం వచ్చింది. జగన్ నుంచి ఎదురైన ఇబ్బందులను అధిగమించి తన పాలనను పూర్తి చేసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి.
* తండ్రీ కొడుకుల్లో తేడా అదే
అయితే రాజశేఖర్ రెడ్డి ఎంత అభిమానించారో..రోశయ్యను జగన్ అంతలా అవమానించారు. ఓ సీనియర్ నేతగా ఆయన చాలా బాధపడ్డారు కూడా. అదే రోశయ్య చనిపోతే కనీసం స్పందించలేదు జగన్. నివాళులు అర్పించేందుకు కూడా వెళ్లలేదు. రోశయ్య విగ్రహ ఏర్పాటుకు ఆర్యవైశ్యులు ప్రయత్నిస్తే ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వలేదు. వైసిపి హయాంలో రోశయ్య వర్దంతులు, జయంతుల నిర్వహణకు కూడా పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఒక్క రోశయ్య విషయంలోనే కాదు చాలామంది నేతలు విషయంలో జగన్ ప్రవర్తన అలానే ఉండేది. అధికారంలోకి రావడానికి ముందు వంగవీటి మోహన్ రంగ నామస్మరణ చేశారు. తరువాత అదే మోహన్ రంగాను మరిచిపోయారు.
* మధ్యాహ్నం తర్వాత ట్వీట్
అయితే తాజాగా నిన్న మాజీ సీఎం రోశయ్య వర్ధంతి. మధ్యాహ్నం దాటిన తర్వాత జగన్ స్పందించారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో అందరూ కంగారు పడ్డారు. రోశయ్య ఉన్నప్పుడు గౌరవించలేదు. చనిపోయినప్పుడు కనీసం భౌతిక కాయానికి నివాళులు అర్పించలేదు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రోశయ్య మాట ఎక్కడ వినిపించకుండా చేశారు. ఇప్పుడు అధికారానికి దూరమయ్యేసరికి అందరూ కావాల్సి వస్తోంది. ఆర్యవైశ్యుల మద్దతు కోసం ఇప్పుడు రోశయ్య పేరు ప్రస్తావించారు జగన్. అయితే జగన్ వైఖరి సొంత పార్టీ నేతలను సైతం విస్మయపరుస్తోంది.