Jagan: రాయలసీమలో( Rayalaseema) రాజకీయం ఎప్పుడు వేడిగానే ఉంటుంది. అందులోనూ అనంతపురం జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పొలిటికల్ ఫైర్ బ్రాండ్లు కూడా అధికం. రాజశేఖర్ రెడ్డి సమయంలో సైతం ఆయనకు ఎదురొడ్డి నిలబడిన నేతలు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా అలానే ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత.. 2019లో మాత్రమే అక్కడ పట్టు చిక్కింది. అయితే ఈ ఎన్నికల్లో అక్కడ కూటమి స్వీప్ చేసింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో ఈరోజు జగన్ అనంతపురం పర్యటనకు వెళ్తున్నారు. అందులోనూ పరిటాల వారి కంచు కోటలో అడుగుపెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.
Also Read: ఏపీ సిఐడికి సుప్రీం కోర్ట్ షాక్!
* మృతుని కుటుంబానికి పరామర్శ..
రాప్తాడు( raptadu ) నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లింగమయ్య అనే బిసి నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. టిడిపి శ్రేణులే ఆయనను హత్య చేశాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. కుటుంబానికి అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఈరోజు నేరుగా వెళ్లి పరామర్శించనున్నారు. ఈ క్రమంలో అక్కడ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్సెస్ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడకు వెళ్తుండడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.
* సమస్యాత్మక నియోజకవర్గం
రాయలసీమలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంలో రాప్తాడు ఒకటి. ఇక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంటుంది. బలమైన ప్రత్యర్ధులు ఉండడంతో సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతుంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మొన్న ఆ మధ్యన పరిటాల సునీత స్పందించారు. పరిటాల రవి హత్యలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోగల శక్తి తమకు ఉందని.. అటు నుంచి అట్టే హెలికాప్టర్లో పంపించగలమంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో పరిటాల రవీంద్ర పులివెందుల వెళ్తే ఆయన వాహనాలను అడ్డుకున్నారని.. నాటి సంగతులను గుర్తు చేశారు. తద్వారా పరిటాల అభిమానుల్లో ఒక రకమైన ఫైర్ తెచ్చే ప్రయత్నం చేశారు.
* జగన్ ను అడ్డుకట్ట వేసేందుకు
అయితే లింగమయ్య హత్య( lingamayya murder ) నేపథ్యంలో టిడిపి పై జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసే అవకాశం ఉంది. బీసీల పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం.. ఒక బీసీ నేతను పొట్టన పెట్టుకుందని ఆరోపించే అవకాశం కనిపిస్తోంది. అందుకే పరిటాల సునీత ముందు జాగ్రత్త చర్యలుగా జగన్మోహన్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి రాకతో రాప్తాడులో రాజకీయం మరింత వేడికి అవకాశం ఉంది. రాప్తాడులో అయితే వైసీపీ వర్సెస్ టిడిపి అన్నట్టు పరిస్థితి ఉంటుంది. 2014లో పరిటాల సునీత గెలిచారు. 2019లో ఆమెపై వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. 2024లో సునీత మళ్లీ గెలిచారు.