Banakacharla project controversy: రాజకీయంగా విభేదించుకున్నా.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటాయి చాలా రాష్ట్రాల్లో. ముఖ్యంగా తమిళనాడుతో( Tamil Nadu ) పాటు కర్ణాటకలో ఈ ఐక్యత కనిపిస్తుంది. కానీ ఏపీలో మాత్రం మచ్చుకైనా ఇది కనిపించదు. అంతెందుకు తెలంగాణలో సైతం అక్కడి నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతుంటారు. కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు ఇక్కడి నేతలు. తాజాగా బనకచర్ల విషయంలో అదే మాదిరిగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి. గోదావరి నది మిగులు జలాలను వినియోగించుకొని.. రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే బనకచర్ల ప్రాజెక్టు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణ సమాజం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి సమయంలో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి.. గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సరికాదని తేల్చి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మిగులు జలాలపై స్పష్టత లేకుండా ఈ లింకు ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసినంత పనిచేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ వాదనలకు బలం చేకూరేలా జగన్ అభిప్రాయం ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: కోట వినూత మరో వీడియో.. కర్మ వెంటాడింది!
అనవసర విమర్శలు..
అయితే ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇలానే వ్యవహరించారన్న విమర్శను మూటగట్టుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో కెసిఆర్ కు తెలంగాణ సీఎం గా ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కానీ అది రాజకీయాల కోసమే వాడుకున్నారు అన్న విమర్శ ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారన్న అపవాదు కూడా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క విభజన సమస్యను కూడా పరిష్కరించలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక మంచి ప్రయత్నం జరుగుతుండగా అడ్డు పుల్లలు వేస్తున్నారన్న విమర్శను ఆయన మూటగట్టుకుంటున్నారు. బనకచర్ల పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకచోట సమావేశం అవుతున్న తరుణంలో.. కావాలనే జాతీయ మీడియాతో మాట్లాడుతూ జగన్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని ఎక్కువమంది నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేంద్రం సైతం వెనక్కి తగ్గింది. అనుమతులు ఇవ్వలేదు. ఇటువంటి తరుణంలో తెలంగాణ వాదనలను బలం చేసే విధంగా జగన్ ప్రవర్తించడం ఏమిటనేది సరికొత్త ప్రశ్న..
Also Read: చంద్రబాబుకు ఏపీ,తెలంగాణ సమానమా?
రాయలసీమపై స్పందించడం ఇలానేనా
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి బలమైన ప్రాంతం రాయలసీమ. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డితో రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం లేదన్న విమర్శ ఉంది. అందుకే రాయలసీమ ప్రజలు కూటమి పార్టీలకు పట్టం కట్టారు. అయితే గోదావరి మిగులు జలాలను మాత్రమే వినియోగించి బనకచర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్నది చంద్రబాబు వ్యూహం. ఒక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ సమాజం అలా స్పందించడం ధర్మం. కానీ ఏపీకి చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రి, బాధ్యత కలిగిన వ్యక్తి ఈ ప్రాజెక్టు నిర్మాణం సరికాదని మాట్లాడడం ఏమిటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే ప్రతి ఒక్కరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుపడుతున్నారు. ప్రాజెక్టులో లోపాలు ఉంటే ఎత్తి చూపాలే కానీ.. అసలు ప్రాజెక్టు నిర్మాణం అనేది సరికాదని వ్యాఖ్యానించడం ఏమిటని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి తప్పిదం అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేస్తే ఎండగట్టాలి కానీ.. రాష్ట్రంలో ఒక ప్రాంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. పైగా రాయలసీమ ప్రయోజనాలు అంటోంది. అటువంటి ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడి చేజేతులా కష్టాలు తెచ్చుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.