YCP Rachabanda: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దూకుడు పెంచింది. ప్రజా సమస్యలపై ఫుల్ ఫాకస్ పెట్టాలని భావిస్తోంది. ఈరోజు నుంచి 40 రోజులపాటు ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి సమరభేరీ మోగించింది. మిగతా విషయాల్లో సైతం కూటమి ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపిస్తూ ఉద్యమాలకు సన్నద్ధం అవుతోంది. ఈరోజు నుంచి రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
* పార్టీలో నిస్తేజం
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఇటువంటి క్రమంలో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. పార్టీలో నెంబర్ 2 గా చలామణి అయిన విజయసాయి రెడ్డి( Vijaya Sai Reddy ) లాంటి నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే పార్టీలో ఉన్నవారు సైతం సైలెంట్ అయ్యారు. చాలామంది సీనియర్లు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అటువంటి వారంతా ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేయాలని కూడా సూచించింది. లేకుంటే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకుంటామని స్పష్టం చేసింది.
* నేతల యాక్టివ్..
చాలా రోజులుగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ). జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన యాక్టివ్ అయ్యారు. మాజీ మంత్రి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు సైతం క్రియాశీలకం కానున్నట్లు తెలుస్తోంది. కేసుల్లో సుదీర్ఘకాలం జైల్లో ఉండి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ మోహన్ లాంటి నేతలు సైతం పార్టీ కార్యక్రమాల్లో హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం ప్రతి నియోజకవర్గ నేతతో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. ఈ రచ్చబండ కార్యక్రమం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను క్రియాశీలకం చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ధ్యేయమని తెలుస్తోంది.
* 40 రోజుల పాటు కార్యక్రమాలు..
ఈరోజు నుంచి నవంబర్ 22 వరకు 40 రోజులు పాటు ఈ రచ్చబండ ( rachabanda) కార్యక్రమం కొనసాగనుంది. నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్నది హై కమాండ్ ఆదేశం. అయితే ఇది కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే విజయవంతం అయ్యే అవకాశం ఉంది. చాలామంది నేతలు క్రియాశీలకంగా లేరు. పార్టీ కార్యక్రమాలను పట్టించుకునే వారు కూడా లేరు. ఆపై కూటమి దూకుడు మీద ఉంది. దీంతో సహజంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గుతాయి. చూడాలి రచ్చబండ ఎంతవరకు సక్సెస్ అవుతుందో..