YS Jagan Pulivendula politics: ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రధానంగా ఒక రకమైన భయం కూడా వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే బెంగళూరు ప్యాలెస్ నుంచి హైదరాబాద్ కు మకాం మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తరచూ పులివెందులలో పర్యటన చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. రేపటి నుంచి మూడు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. స్థానికంగా అందుబాటులో ఉండనున్నారు. పులివెందులలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తరచూ పర్యటనలు చేస్తున్నారు. పులివెందుల జడ్పిటిసి బై ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో కూడా మార్పు కనిపించింది. గతంలో పులివెందుల నియోజకవర్గాన్ని అవినాష్ రెడ్డి లాంటి వారిని అప్పగించేవారు జగన్. అలానే కొనసాగితే 2029 ఎన్నికల నాటికి పులివెందులలో తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అని తెలుసుకున్నట్టు ఉన్నారు. అందుకే తరచూ అక్కడ పర్యటనలు సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఓటమితోనే ఆయనలో ఈ మార్పు అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
ఐదు దశాబ్దాలుగా ఆ కుటుంబానికి..
దాదాపు 5 దశాబ్దాల పాటు పులివెందులను ( pulivendula ) పెట్టని కోటగా మార్చుకుంది వైయస్సార్ ఫ్యామిలీ. 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు రాజశేఖర్ రెడ్డి. అది మొదలు ఇప్పటివరకు ఆ నియోజకవర్గం వైయస్సార్ ఫ్యామిలీదే. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎవరు అధికారం చేపట్టిన పులివెందులలో మాత్రం అడుగు పెట్టేందుకు సాహసించే వారు కాదు. అటువంటిది ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును కుప్పం వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వార్ వన్ సైడ్ అన్నట్టు ప్రత్యర్ధులు లేకుండా చేశారు. అప్పటివరకు ఆ కుటుంబానికి తెలిసిన విద్యను రాష్ట్రానికి పరిచయం చేశారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత.. పులివెందుల జడ్పిటిసి బైపోల్స్ ను కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించేలా చేసింది. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డిపాజిట్లు దక్కకుండా చేసింది. అయితే అధికార మదంతో విజయం సాధించిందని వైసీపీ ఆరోపిస్తున్నా.. ఆ పార్టీకి మాత్రం భయం వెంటాడుతోంది.
కుటుంబంలో చీలిక..
పైగా వైయస్ కుటుంబంలో అడ్డగోలు చీలిక వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని( Y S Jagan Mohan Reddy ) ఆయన తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిల విభేదిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సునీత రెడ్డి సైతం పట్టు బిగిస్తున్నారు. అప్పటివరకు వైయస్సార్ కుటుంబం పై పులివెందుల ప్రజలు పెద్దగా అభిమానం చూపేవారు. కానీ ఆ కుటుంబంలో చీలికతో పాటు విభేదాలతో ప్రజల్లో సైతం మార్పు వచ్చింది. ఆ విషయాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తరచూ పులివెందులలోనే పర్యటనలు చేస్తున్నారు. గతంలో అయితే ఆ కుటుంబం పులివెందులలో పర్యటనలు, ఎన్నికల ప్రచారాలు చేసిన దాఖలాలు లేవు.. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గాన్ని అంటి పెట్టుకోవడం కనిపిస్తోంది.