YS Jagan Mohan Reddy: వైసిపి వ్యవస్థాపకుడు.. అధినాయకుడు జగన్ ఇటీవల కాలంలో వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా ఎన్నడు విలేకరుల సమావేశం నిర్వహించలేదు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కోసం తన సొంత మీడియాలో రకరకాల కథనాలు రాయించారు. కొంతమంది పెయిడ్ వ్యక్తులతో రకరకాల ప్రచారాలు చేయించారు. రైతుల సమస్య మీద మాట్లాడారు. అమరావతి మీద మాట్లాడారు. మావిగన్ అనే కొత్త పల్లవి అందుకున్నారు. ఇటీవరి కాలంలో జోసెఫ్ అలియాస్ రావణ్ విషయంలో కూడా స్పందించారు.
ఇన్ని పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ కూడా నేరుగా బయటికి రాలేదు. ధైర్యంగా.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. కాకపోతే ఈ పరిణామాల వెనక రాజకీయాలను మాత్రం పగడ్బందీగా కొనసాగించారు. ఇటువంటి విధానాలు దీర్ఘకాలంలో తనకు నష్టం కలిగిస్తాయని తెలిసినప్పటికీ జగన్ వ్యూహాత్మక ప్రతీకారాన్ని మాత్రమే తీర్చుకుంటారు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసే విధానం ఇదే విధంగా ఉంటుంది.
ఉదాహరణకు జోసెఫ్ విషయం తీసుకుంటే.. అతడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడని.. గతంలో టిడిపికి మద్దతు పలికాడని ప్రచారంలో ఉంది. అయితే అతడికి తెర వెనుక సహాయం చేస్తోంది మాత్రం వైసిపి నే.. ఎందుకంటే జోసెఫ్ అరెస్టు తర్వాత.. అతడి మనుషులు నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మద్దతు కోరారు. దానికి ఆయన ఒప్పుకున్నారు. దీనికి తోడు మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రావణ్ కేసు విచారించడానికి న్యాయవాదిగా నియమించారు. అంబటి రాంబాబు కూడా రావణ్ కోసం పోరాటం సాగిస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని పలుచన చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను చేదించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే.. ఫ్యాన్ పార్టీ మాత్రం సామాజిక మాధ్యమాలలో విషనాగులకు అండగా ఉంటుంది. సమాజంలో అశాంతిని కలగజేసే వ్యక్తులకు న్యాయపరంగా.. ఆర్థికపరంగా రక్షణ కల్పిస్తోంది. దీనిని బట్టి జగన్ ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఆ వ్యక్తులతో తమకు సంబంధం లేదని తన మీడియా ద్వారా జగన్ చెప్పిస్తుంటారు. అందువల్లే ఆ పార్టీ క్రెడిబిలిటీ రోజురోజుకు ప్రజల్లో తగ్గిపోతుంది. ఇటువంటి తెర వెనక రాజకీయాలు చేయడం వల్ల ఆ పార్టీ ఒక రకమైన దౌర్భాగ్య స్థితిని ఎదుర్కొంటున్నది.
2024 ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు మాత్రమే వైసీపీని పరిమితం చేశారు. ఇలాంటి అప్పుడు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవడానికి.. మళ్లీ బలపడేందుకు ప్రయత్నాలు చేయాలి. కానీ అలా కాకుండా తెర వెనుక రాజకీయాలు మాత్రమే జగన్ చేస్తున్నారు. వ్యవస్థలను.. మహిళలను లక్ష్యంగా చేసుకొని.. విషాన్ని చిమ్ముతున్న వారికి అండగా ఉంటున్నారు. ఇటువంటి వ్యక్తుల వల్ల తాత్కాలిక ఆనందం జగన్మోహన్ రెడ్డికి కలుగుతుందేమో.. ఆయన మీడియాలో పేజీలకు పేజీలు వార్తలు కనిపిస్తాయేమో.. కానీ దీర్ఘకాలంలో ప్రజల్లో జగన్ నమ్మకాన్ని కోల్పోక తప్పదు.
