DK Shivakumar Strategy On Jagan: జాతీయస్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. ఎన్డీఏ హవా నడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించిన చాలా పార్టీలు ఇప్పుడు.. అదే కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నాయి. మొన్నటికి మొన్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్లు వార్తలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీన ప్రతిపాదన కూడా వచ్చినట్లు ప్రచారం నడిచింది. అయితే ఒక్క మమతా బెనర్జీ మాత్రమే కాదు వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీకి దూరమైన బలమైన నేతలను వెనక్కి తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీని విభేదించిన మిగతా పార్టీలు ఇప్పుడు.. అదే హస్తం పార్టీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ జగన్మోహన్రెడ్డిని ఇండియా కూటమిలోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
* ఎన్డీఏ బలంగా..
ఏపీలో ఎన్డీఏ కూటమి విషయంలో పూర్తిగా స్పష్టత ఉంది. ఆ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లడం ఖాయం. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుని కూటమిని మరింత బలోపేతం చేసే పనిలో ఉన్నాయి టిడిపి, జనసేనలు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సైతం ఆ రెండు పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తోంది. పరోక్ష సహకారంతో బిజెపితో ఒక అవగాహన ఉన్న వైసీపీకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక బిజెపిని నమ్ముకుంటే తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అలాగని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్తో పాటు వామపక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వైసిపి బలానికి ఆ రెండు పార్టీల బలం తోడైతే అతి కష్టంగానైనా ఏపీలో అధికారంలోకి రావచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు ప్రచారం నడుస్తోంది.
* విజయ్ తాజా ప్రతిపాదన..
తమిళనాడులో సీఎంగా ఉన్నారు దళపతి విజయ్. కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలోపేతానికి విజయ్ సైతం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి విజయ్ కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఒకవైపు డీకే శివకుమార్, మరోవైపు విజయ్ జగన్మోహన్ రెడ్డి కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. మరి అందులో వారు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
