Jagan And Anil Kumar Yadav: నెల్లూరు( Nellore) జిల్లాలో రాజకీయాలు మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలవడంతో అక్కడ టిడిపి పట్టు బిగిస్తోంది. అయితే ఎలాగైనా పూర్వ వైభవం సాధించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో చాలామంది వైసీపీ నేతలు టిడిపిలో చేరిపోయారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నవారు సైతం చాలా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కనీసం వైసిపి రాజకీయాల గురించి కూడా మాట్లాడడం లేదు. వైసిపి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సొంత సామాజిక వర్గం వారిని కాదని అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు వైసిపి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కనిపించకపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది.
* రెండుసార్లు వైసీపీ తరఫున..
నెల్లూరు నగరం నుంచి రెండుసార్లు గెలిచారు అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav). 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గెలవలేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. 2014లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ టిడిపి అధికారంలోకి వచ్చింది. అయినా సరే దూకుడుగా వ్యవహరిస్తూ.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం.. నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలవడంతో మంత్రివర్గంలో ఆయనకు చాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సొంత సామాజిక వర్గం నేతలు ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. అయితే అనిల్ తీరుకు నిరసనగా చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కాదు.. నెల్లూరు జిల్లాలో దారుణ పరాజయం చూసింది.
* నరసరావుపేటకు షిఫ్ట్ చేసినా..
అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి నరసరావుపేట( Narasaraopeta) ఎంపీ స్థానానికి షిఫ్ట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి. అయినా సరే అనిల్ కుమార్ యాదవ్ కు అక్కడ దారుణ ఓటమి తప్పలేదు. అయితే ఓడిపోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు వచ్చింది చాలా తక్కువ. అప్పుడప్పుడు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. తిరిగి వెళ్ళిపోవడం జరుగుతోంది. నెల్లూరు వైసీపీ బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి ఓ ఎమ్మెల్సీకి అప్పగించారు. అయితే నరసరావుపేట పార్లమెంట్ ఇన్చార్జిగా కూడా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. కానీ అక్కడకు సైతం వెళ్లడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పుడప్పుడు చుట్టూ చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించడం లేదు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వేరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్టివ్ అయితే తప్ప వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే తనకు నెల్లూరు అర్బన్ ఇన్చార్జి పదవి ఇవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ కోరుతుంటే.. అందుకు జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మొత్తానికి అయితే ఆ మాజీ మంత్రి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టే.
