Jagan Mohan Reddy Political Strategy: అధికారం ఉన్నన్ని రోజులు కన్ను మిన్ను కనిపించవు అంటారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి అదే విధంగా ఉండేది. ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శాసనసభలో ఇష్టానుసారంగా మాట్లాడేవారు. వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడేవారు. కొన్ని సందర్భాలలో వెకిలి చేష్టలకు పాల్పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. చివరికి నాడు వైసిపి నాయకులు చేసిన పని పట్ల చంద్రబాబు తీవ్రంగా దుఃఖించారు.
ఇప్పుడు అధికారం పోయింది. ముఖ్యమంత్రి స్థానం కూడా దూరమైంది. వై నాట్ 175 అనుకున్నచోట.. 11 సీట్లు మాత్రమే మిగిలాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధ పడినట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి.. దానికోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే దూరమైన నేతలను దగ్గరికి పిలిపించుకుంటున్నారు. ఒకప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని నేతలకు నేరుగా ఫోన్ చేస్తున్నారు. వారి కుశల వ్యవహారాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఇటీవల జగన్ నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండేవారు. ఆయన కూడా జగన్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని రకరకాలుగా వాడుకున్నారు.. “జగన్ నన్ను మాత్రమే టేబుల్ దగ్గరికి తీసుకెళ్తారు. భోజనం పెడతారు” అని ఆ నాయకుడు తన సన్నిహితుల వద్ద పదేపదే చెప్పుకునేవారు. కానీ, రాజకీయాల్లో ఎన్నడూ స్నేహాలు వర్ధిల్లవు. అలాగని శత్రుత్వాలు కూడా చిరకాలం కొనసాగవు. అప్పట్లో జగన్ వ్యవహార శైలి తట్టుకోలేక ఆ నాయకుడు కూడా పార్టీ వదిలి వెళ్ళిపోయారు. అయితే అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్ ఆ నాయకుడికి ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తన వద్దకు రావాలని సూచించినట్టు తెలుస్తోంది.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కుర వృద్ధుడిగా పేరుపొందిన ఓ నాయకుడు ఇచ్చిన విందులో ఈ విషయాలు బయటపడ్డాయి.
పేరు రాయడానికి ఇష్టపడని కొంతమంది నేతలు ఈ విషయాన్ని బయటపెట్టినట్టు తెలుస్తోంది.. ” ఆ విందుకు నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు వచ్చారు. ఆయన రాగానే పరిస్థితి మారిపోయింది. కుశల ప్రశ్నలు ముగిసిన తర్వాత జగన్ పంపిన రాయబారం గురించి చర్చ నడిచింది. అయితే జగన్ చెప్పిన చోటుకు ఆ నాయకుడు వెళ్తారా? లేదా? అనేది అర్థం కావడంలేదని” ఆ నేతలు చెబుతున్నారు. మొత్తానికి అధికారం కోల్పోయిన తర్వాత జగన్ నాయకులకు దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నం బాగుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.