YS Jagan Mohan Reddy: షర్మిల కూతురు వివాహం బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో జరిగే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికల మీద.. వివాహం జరిగే వేదికను బెంగళూరులోని యలహంక ప్యాలెస్ గా పేర్కొన్నారు. వివాహ పత్రికలను కూడా అతిధులకు అందజేస్తున్నారు. అయితే షర్మిల కుమార్తె వివాహానికి ప్యాలెస్ ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేయడంతో.. అక్కడ పెళ్లి జరిగేది అనుమానంగానే కనిపిస్తోంది.
జగన్, షర్మిల మధ్య ప్రస్తుతం విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. గత ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయద్దని షర్మిల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. షర్మిలకు వ్యతిరేకంగా వైసిపి.. దాని అనుబంధ సోషల్ మీడియా విభాగాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదాలు మరో స్థాయికి చేరుకున్నాయి. తనకు ఆస్తిలో వాటాలు ఇవ్వడం లేదని షర్మిల.. తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని జగన్.. ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. అన్నా, చెల్లి మధ్య నెలకొన్న వివాదాలను తగ్గించడానికి.. సమస్యను పరిష్కరించడానికి విజయలక్ష్మి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే ఉపయోగం లేకుండా పోతోంది. దీనికి తోడు ఇద్దరి మధ్య వివాదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.
జగన్ బెంగళూరు ప్యాలెస్ ఎందుకు ఇవ్వడం లేదు.. షర్మిల కుమార్తె వివాహం జరగడానికి ఎందుకు ఎందుకు ఒప్పుకోవడం లేదు.. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది.. ఇప్పటివరకు మీడియా సంస్థలలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. సాక్షి ఒక రకంగా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి మరొకరకంగా కథనాలను రాశాయి. వాస్తవానికి ఈ పత్రికలు ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి కాబట్టి.. ఇందులో నిజం ఎంతుందో తెలియదు. కానీ జగన్ యలహంక ప్యాలస్ ఇవ్వకపోవడానికి అసలైన కారణాన్ని వైసీపీ నేత పేర్ని నాని బయటపెట్టారు.
జగన్ కు ప్రాణహాని ఉందట. పైగా ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుందట. అలాంటి వ్యక్తి నివాసం ఉండే ప్రాంతంలో వివాహం జరపడానికి ఎలా అనుమతి ఇస్తారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. పైగా జగన్ ప్యాలెస్ కు.. చంద్రబాబుకు లింకుపెట్టి ఆయన మాట్లాడారు. చంద్రబాబు హైదరాబాదు నగరంలో విలాసవంతమైన నివాసం నిర్మించుకున్నారని.. కనీసం ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు ఇంతవరకు బయటికి రావని.. చంద్రబాబు ఇంట్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు మాదిరిగానే.. జగన్ కూడా అని.. ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టే ప్యాలస్ లో వివాహం జరపడానికి ఒప్పుకోవడం లేదని పేర్ని నాని అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఇప్పటివరకు షర్మిల కూతురు వివాహం నిర్వహించడానికి ప్యాలస్ ఇవ్వకపోవడం వెనక ఆస్తుల వివాదం ఉందని అందరు అనుకున్నారు. కానీ జగన్ కు ప్రాణహాని ఉంది కాబట్టి.. ప్యాలస్ ఇవ్వడం లేదని పేర్ని నాని చెబుతున్నారు. అంటే వచ్చిన బంధువులు జగన్ కు ప్రాణ హాని కలగజేస్తారా.. ముకుమ్మడిగా జగన్ మీద దాడి చేస్తారా.. ఈ ప్రశ్నలకు పేర్ని నాని క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదని టిడిపి నేతలు అంటున్నారు.