YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే మొండితనం సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఓడించింది. అయితే ఏది మంచి.. ఏది చెడ్డ అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఆ పార్టీకి ఉంది. గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అంతకుమించి ఉంది. లేకుంటే వారికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అయితే ఇప్పుడు జగన్ నిర్ణయాలను ఆ పార్టీ సీనియర్లు తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. తనకోసం అడ్డగోలుగా బలైన వారి విషయంలో జగన్ పట్టించుకోవడం లేదట. కానీ అనవసర వివాదాలతో, వివాదాస్పద ముద్ర కలిగిన నేతల విషయంలో జగన్ సానుభూతితో వ్యవహరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సీదిరి అప్పల రాజును పరామర్శించేందుకు విశాఖ వెళ్తున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో ఆయనతో ములాఖత్ కానున్నారు. అయితే దీనిపై సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకు వెళ్లిన వారి విషయంలో ఒకలా.. అనవసర జోక్యంతో వివాదాలు తెచ్చుకున్న వారి విషయంలో మరోలా వ్యవహరించడం ఇప్పుడు పార్టీలో చర్చకు దారి తీస్తోంది.
* రోజుల తరబడి జైలులో..
మద్యం కుంభకోణం అనేది ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మించి ఈ కుంభకోణం జరిగింది. అటువంటి స్కామ్ లో నిందితులుగా ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది బహిరంగ రహస్యం. ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి పెద్ద నేత కుమారుడు మిథున్ రెడ్డి సైతం అరెస్టు అయ్యారు. నిత్యం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం అరెస్టయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి.. సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డిగా పని చేసిన కృష్ణ మోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రముఖుల అరెస్టు అయ్యారు. కానీ వారిని పరామర్శించేందుకు ఎప్పుడు కూడా మొగ్గు చూపలేదు జగన్మోహన్ రెడ్డి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి ఉండిపోయారు మిధున్ రెడ్డి. కుమారుడి కోసం కుటుంబంతో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రిలోనే ఉండి పోవాల్సి వచ్చింది. కానీ కనీసం వారిని పరామర్శించిన దాఖలాలు కూడా లేవు.
* మాజీ మంత్రి అప్పలరాజు పరామర్శ..
ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణానికి కారణం అయ్యారు మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు. కానీ ఆ కేసులో తన కుమారుడిని తప్పించి మరొకరిని బలిపశువు చేశారు. ఈ ప్రయత్నంలోనే అడ్డంగా బుక్ అయ్యారు అప్పలరాజు. చట్టపరంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇందులో రాజకీయ జోక్యం కూడా లేదు. ఒక డాక్టర్ గా, రాజకీయ నాయకుడిగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా వ్యవహరించాల్సింది పోయి.. అడ్డగోలుగా వ్యవహరించారు అప్పలరాజు. అటువంటి నేతను నేరుగా పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకోవడం మాత్రం పార్టీ శ్రేణులకు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. 18 సంవత్సరాల కుర్రాడు చేసిన తప్పును అంటూ వ్యాఖ్యానించిన జగన్ విమర్శలకు గురయ్యారు. అయినా సరే దానిని గుణపాఠంగా మార్చుకోలేదు. ఇప్పుడు నేరుగా అప్పలరాజును పరామర్శించేందుకు వెళ్తున్నారు. తనకోసం జైలుకు వెళ్లిన వారిని కాకుండా.. వ్యక్తిగత వ్యవహార శైలి కారణంగా జైలు పాలైన నేతలను పరామర్శించడం మాత్రం.. సొంత పార్టీ శ్రేణులనే విస్మయం గురిచేస్తోంది.