YS Jagan Mohan Reddy: ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లో గెలవకుంటే బయట గెలిచినా విలువ లేదంటారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు మాజీ సీఎం జగన్. సొంత జిల్లా కడపపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అక్కడ పార్టీ పరంగా ఉన్న లోపాలను అధిగమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కడప జిల్లా అంటేనే వైయస్సార్ కుటుంబం కనిపిస్తుంది. ఆ కుటుంబానికి పెట్టని కోటగా ఉండేది. కానీ ఎన్నికల్లో మాత్రంవైయస్ కుటుంబ కోట బద్దలైంది. కూటమి స్పష్టమైన మెజారిటీ స్థాపించింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడింట విజయం సాధించింది. అప్పటినుంచి జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభం అయ్యాయి. కూటమి దూకుడుకు వైసిపి విలవిలలాడుతోంది కడపలో. నాయకత్వం సైతం సరైన స్థితిలో లేదు. ఈ తరుణంలో జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వచ్చింది.పలుమార్లుకడప ను సెట్ చేసేందుకు ప్రయత్నించారు.తాజాగా అదే పనిపై కడప వెళుతున్నారు.నాలుగు రోజులు పాటు కడపలోనే గడపనున్నారు.చాలా వ్యూహాత్మకంగా పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.
* స్థానిక సంస్థల ప్రతినిధులను కాపాడుకునేందుకు
కడప జిల్లాలో బద్వేల్,కడప,కమలాపురం తో పాటు అన్ని నియోజకవర్గాల్లో స్థానిక సంస్థలు వైసిపి చేతిలోనే ఉన్నాయి. అయితే ఇందులోబద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా జనసేన వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.ఇటీవల వైసిపి కార్యక్రమాలకు ఆమె గైర్హాజరయ్యారు.దీంతో జగన్ ఆమెను బుజ్జగించనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల వైపు చూడకుండా జగన్ దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల ప్రతినిధులు కూటమి పార్టీలవైపు చూస్తున్నారు. దీంతో వారిని సైతం నియంత్రించేందుకు జగన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
* ప్రజా దర్బార్ నిర్వహణ
నాలుగు రోజులపాటు కడప జిల్లాలోనే గడపనున్నారు జగన్. నేరుగా ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను తెలుసుకోనున్నారు. వినతి పత్రాలు స్వీకరించనున్నారు. గతంలో పులివెందులలో చాలాసార్లు పర్యటించారు జగన్. ఎక్కువగా తన సొంత పనులకే పరిమితం అయ్యారు. జిల్లా ప్రజలను మాత్రం కలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇప్పుడు ప్రజా దర్బారు నిర్వహించివారి నుంచి వినతులు స్వీకరించనున్నారు. పనిలో పనిగా పులివెందులలో దీపావళి పండుగ జరుపుకొనున్నారు.
* ఆ కుటుంబాన్ని తిప్పుకునేందుకు
షర్మిల ప్రభావం కడప జిల్లా పై అధికంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు ఆమె. లక్ష యాభై వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇదేం అంత చిన్న విషయం కాదు. ఆమె రాజకీయంగా మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆమె ప్రయత్నాలు వర్కౌట్ అయితే వైసిపి ఓట్లకు గండి పడే అవకాశం ఉంది. అందుకే జగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షర్మిల వైపు ఓటర్లు కాకుండా చేయాల్సిన అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబంలో మెజారిటీ కుటుంబ సభ్యులను తన వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. అది తనకు శ్రేయస్కరమని భావిస్తున్నారు. కడప జిల్లాలో నాలుగు రోజులు పర్యటించనున్న జగన్.. పులివెందులలోనే ఎక్కువ సమయం గడపనున్నట్లు తెలుస్తోంది.