Jagan Vs Anam : వైసీపీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న జిల్లా నెల్లూరు. గడిచిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీ వైట్ వాష్ చేసింది. గత ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాల్లోనూ గెలుపు సాధించింది. అందుకే ఆ జిల్లాపై టీడీపీ ఫోకస్ పెట్టింది. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలో టీడీపీ నాయకత్వం సక్సెస్ అయ్యింది. దీంతో అక్కడ పట్టు జారకుండా వైసీపీ నాయకత్వం ప్రత్యమ్నాయ చర్యలతో అలెర్ట్ అయ్యింది. మూడు నియోజకవర్గాల్లో ఇన్ చార్జులను నియమించింది. ముగ్గురు ఎమ్మెల్యేలు దగ్గర కావడంతో పాటు లోకేష్ యువగళం యాత్రతో టీడీపీలో జోష్ నెలకొంది. వైసీపీలో ఒకరకమైన కలవరపాటు ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో సీఎం జగన్ పర్యటించాలని డిసైడ్ కావడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.
ఇటీవల జగన్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాల బటన్ ను ప్రజలు మధ్య నొక్కుతున్నారు. దీంతో ప్రజాదరణ పెరుగుతుందని భావిస్తున్నారు. గత ఆరు నెలలుగా ఈ పర్యటనలు బాగానే సాగుతున్నాయి. సంక్షేమ పథకాల ప్రారంభం నుంచి వివిధ ప్రాజెక్టులకు జిల్లాలకు వెళ్లి శ్రీకారంచుడుతున్నారు. ఈ నేపథ్యంలో నేతన్న హస్తం పథకాన్ని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఆ నియోజకవర్గానికి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఆయన టీడీపీకి దగ్గరయ్యారు. ప్రస్తుతం అక్కడ నేదురమల్లి రాంకుమార్ రెడ్డి వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. అక్కడ ఆనంకు గట్టి దెబ్బతీయ్యాలని డిసైడయిన సీఎం జగన్ నేతన్న హస్తం పథకానికిగాను బటన్ నొక్కనున్నారు.
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏమంత బాగాలేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. నెల్లూరు సిటీలో వర్గపోరు నడుస్తోంది. అక్కడ మాజీ మంత్రి నారాయణను టీడీపీ రంగంలో దించనుంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతోనే ఓటమిచవిచూశారు. దీంతో నారాయణపై నెల్లూరు సిటీ ప్రజలకు సానుభూతి ఉంది. టీడీపీ హయాంలో నెల్లూరు సిటీని అభివృద్ధి చేశారన్న పేరు ఉంది. ఇప్పటికే అక్కడ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అక్కడ ఇద్దరి మధ్య సెట్ చేసే పనిలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు జిల్లాలో పదికి పది సీట్లు టీడీపీకి గెలిచిపెడతామని సీనియర్ నేతలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతినబూనారు. అందుకే జగన్ ప్రత్యేకంగా వారిద్దరిపై దృష్టిపెట్టారు. అందుకే పనిగట్టుకొని ఆనం నియోజకవర్గం వెంకటగిరిలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో నేత కార్మికులు అధికం. అక్కడ నుంచి నేతన్న హస్తం బటన్ నొక్కడంతో పాటు నేత కార్మికులకు వరాలు ప్రకటించే అవకాశముంది. తద్వారా ఆనంను దెబ్బతీయాలన్నది జగన్ ప్లాన్. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.