Jagan political strategy: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ పరిస్థితి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇక్కడ పార్టీకి పెద్దదిక్కుగా ధర్మాన ఫ్యామిలీ ఉంది. కానీ అదే ధర్మాన ఫ్యామిలీ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్స్ అయినా దువ్వాడ శ్రీనివాస్ ఎగిరి పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గట్టిగానే టార్గెట్ చేసుకుంటున్నారు. కానీ వైసీపీ నాయకత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు అని ధర్మాన సోదరులపై కోపం పెంచుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. అప్పటినుంచి ఆ ధర్మాన సోదరులు ఇద్దరినీ టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ వెనుక వైసీపీలో పెద్ద తలకాయ ఉందన్నది అనుమానం. అందుకే తాడోపేడో తెలుసుకోవాలి అని ధర్మాన సోదరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ ధీమా వెనుక ఎవరు?
కొద్ది నెలల కిందట ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై( duvvada Srinivas ) సస్పెన్షన్ వేటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తిరిగి తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ధీమాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెబుతున్నారు. తన కోపమంతా ధర్మాన సోదరులపై మాత్రమేనని.. వారు కింజరాపు ఫ్యామిలీతో కలిపి తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతున్నారు దువ్వాడ. అదే సమయంలో అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల గౌరవభావంతో ఉన్నారు. దీనిపై ధర్మాన సోదరుల్లో అనుమానం పెరుగుతోంది. అందుకే దువ్వాడను పార్టీ నుంచి బహిష్కరిస్తారా? లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోమంటారా? అని అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది.
పార్టీ పెద్దల హస్తం..
గత కొద్ది రోజులుగా ధర్మాన సోదరులను టార్గెట్ చేసుకుంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. అసలు వైసీపీ నుంచి ఆయన సస్పెన్షన్కు గురయ్యారు. కానీ పార్టీలో పరిణామాలపై మాట్లాడుతున్నారు. పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు ధర్మాన బ్రదర్స్. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కృష్ణ దాస్. ప్రతి నియోజకవర్గంలో సమీక్ష చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కృష్ణ దాస్ ను టార్గెట్ చేసుకున్నారు దువ్వాడ. అది కూడా కాళింగ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని. లేనిపోని ఆరోపణలు చేస్తుంటే ధర్మాన బ్రదర్స్ మనస్థాపానికి గురవుతున్నారు. పైగా దువ్వాడ శ్రీనివాస్ హై కమాండ్ పేరు తరచూ చెబుతున్నారు. దీంతో వైసిపి పెద్దల నుంచి దువ్వాడకు అభయం ఉందన్న అనుమానం వీరిలో పెరుగుతోంది. అందుకే దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తారా? లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోమంటారా? అని నేరుగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ధర్మాన బ్రదర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పెద్ద చిచ్చు పెడుతున్నారు. ఒకవేళ దువ్వాడ కోసం ధర్మాన బ్రదర్స్ ను వదులుకుంటే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో పార్టీ భూస్థాపితం కావడం ఖాయం.