Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ హాట్ కోర్ రీజియన్. కానీ గడిచిన ఎన్నికల్లో ఆ ప్రాంతంలోనే వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. 2014లో కేవలం అనంతపురం జిల్లాలోనే ప్రభావం చూపింది తెలుగుదేశం పార్టీ. మిగతా మూడు జిల్లాల్లో వైసీపీదే హవా నడిచింది. కర్నూలు జిల్లాలో అయితే తెలుగుదేశం పార్టీకి నిరాశ ఎదురైంది. అయితే 2024కు వచ్చేసరికి సీన్ మారింది. హేమాహేమీ నేతలంతా ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు కళ్లెం పడింది. కానీ 2029 ఎన్నికల నాటికి పూర్వస్థితికి రావాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది.
Also Read: కాశీబుగ్గ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు బిగ్ రిలీఫ్!
కర్నూలు జిల్లాలో బలమైన నేతలను రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పట్టుబిగుస్తోంది. ముఖ్యంగా పేరుమోసిన రెడ్డి సామాజికవర్గం కుటుంబాలన్నీ టీడీపీ వైపు ఉన్నాయి. వాపు చూసి బలుపు అనుకున్నారు జగన్. అందుకే కోట్ల, బైరెడ్డి, భూమాలాంటి కుటుంబాలను వదులుకున్నారు సరికదా.. ఆ కుటుంబాలకు సవాల్ చేసినంత పనిచేశారు. దీంతో కర్నూలు అంటేనే కొరకరాని కొయ్యగా మార్చుకున్నారు.
అయితే ఇప్పుడు బుట్టా రేణుక సేవలను వినియోగించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఆమెను ఎంపీగా పోటీచేయించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు రేణుక. తరువాత జగన్ గూటికి వచ్చారు. 2014లో రాష్ట్రంలో టీడీపీ గెలిచినా.. కర్నూలు ఎంపీగా గెలిచారు బుట్టా రేణుక. అయితే సరిగ్గా 2018లో టీడీపీలోకి ఫిరాయించారు. కానీ అక్కడ ఇమడ లేకపోయారు. కొద్దిరోజులకే వైసీపీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో చోటుదక్కలేదు. 2024 ఎన్నికల్లో జగన్ అసెంబ్లీకి ఆమెకు అవకాశమిచ్చారు. కానీ నెగ్గలేకపోయారు. ఇప్పుడు మరోసారి ఆమెను ఎంపీగా పోటీచేసేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.