Ex minister balineni srinivasreddy : నిజంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారా? లేకుంటే జగన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి అలా వ్యవహరిస్తున్నారా? అసలు పార్టీ మారే ఉద్దేశం బాలినేనికి ఉందా?ఆయన మారితే ఏ పార్టీలో చేరుతారు? ఆయనకు ఏ పార్టీ ఆప్షన్? ఇప్పుడిదే వైసీపీలో చర్చగా మారింది. కేవలం జగన్ ను దారిలో తెచ్చుకొని ప్రకాశం జిల్లాలో తన పట్టు నిలుపుకోవాలని బాలినేని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితుల్లో ఏ నాయకుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పినా జగన్ కు మైనస్ తప్పదు. అందున సమీప బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వదులుకుంటే జగన్ కు బ్యాడ్ నేమ్ ఖాయం. దగ్గర బంధువే పార్టీలు ఉండలేరని.. ఇక మిగతా నాయకుల పరిస్థితి ఏంటని ప్రత్యర్థులు ప్రచారం చేస్తారు. అందుకే బాలినేనిని పార్టీలో కొనసాగేలా జగన్ చూస్తున్నారు. అందుకే మాజీ మంత్రి విడదల రజినిని ప్రయోగించారు. గతంలో ఇదే మాదిరిగా బాలినేని అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు విజయమ్మను ప్రయోగించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బాలినేని వ్యవహరిస్తున్న తీరుతో జగన్ చాలా అసహనంతో ఉన్నారు. కానీ ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి ఆయనది. ఒకవేళ బాలినేని పార్టీ మారితే.. చాలా రకాలుగా అభియోగాలు మోపుతారని జగన్ భయపడుతున్నారు. ఇప్పటికే కుటుంబ రాజకీయాలతో జగన్ విసిగిపోయారు. ఇప్పుడు బాలినేని బయటకు వెళ్తే జగన్ పై ముప్పేట విమర్శలు రావడం ఖాయం.
* అదును చూసి కోరికలు
అదును చూసి బాలినేని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీలో టాక్.వైసిపి కాంగ్రెస్లో విలీనం అవుతుందని తన సన్నిహితుల వద్ద బాలినేని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కేవలం షర్మిల అడ్డుకోవడం వల్లే మిగిలిన ప్రక్రియ నిలిచిపోయిందని.. రాబోయే కాలంలో జరిగేది అదేనంటూ బాలినేని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఇది జగన్ లో ఒక రకమైన భయానికి కారణం అవుతోంది. బాలినేని బయటకు వెళితే షర్మిల మాదిరిగానే మనకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన రాజకీయం కోసం జనసేన పేరును బాలినేని వాడుకుంటున్నారు.
* పెద్ద డిమాండ్స్
అయితే వైసీపీలో కొనసాగేందుకు బాలినేని గొంతెమ్మ కోరికలను జగన్ వద్ద బయటపెట్టినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో వైసీపీ బాధ్యతలను తనకే అప్పగించాలని.. తన నిర్ణయం మేరకు మాత్రమే వ్యవహారాలు నడవాలని బాలినేని కోరుతున్నారు. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డిని బయట ప్రాంతాలకు పరిమితం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్. ఈ విషయంలో బాలినేని డిమాండ్లకు ఒప్పుకుంటే.. ప్రతి జిల్లా నుంచి సీనియర్ నేతలు ఇదే డిమాండ్లను తెరపైకి తెస్తారని జగన్ భయం.అందుకే బాలినేని విషయంలో జగన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం.
* నిజంగా ఆప్షన్ ఉందా
అయితే ఇప్పుడు బాలినేనికి ఆప్షన్ ఉందా? అంటే స్ట్రెయిట్ గా సమాధానం దొరకని పరిస్థితి. బాలినేని జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. కానీ జనసేనకు బాలినేని అవసరం లేదు. బాలినేని విషయంలో టిడిపి సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.అయితే అప్పుడు ఆయనకు ఉన్న ఏకైక ఆప్షన్ షర్మిల. జగన్ భయం కూడా అదే. బాలినేని జనసేనలో చేరినా పర్వాలేదు కానీ.. షర్మిల వెంట అడుగులు వేస్తే మాత్రం మరింత ఇబ్బందులు తప్పవని జగన్ భావిస్తున్నారు. అందుకే బాలినేని విషయంలో కొన్ని మినహాయింపులు ఇస్తున్నారు. కానీ ఇదే అదునుగా లేనిపోని కోరికలను జగన్ ముందు ఉంచడంతో.. వైసిపి అధినేతలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.