YS JAgan- BJP : జగన్ అనుకున్నది సాధించారా? లేక కథ అడ్డం తిరిగిందా? చేజేతులా బిజెపితో వైరం పెట్టుకున్నారా? ఇండియా కూటమికి దగ్గరై తప్పు చేశారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యా రాజకీయాలు పెరిగాయని జగన్ ఆరోపిస్తున్నారు. విధ్వంసకర ఘటనలు జరిగాయని చెప్పుకొస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీ వేదికగా గళం ఎత్తాలని నిర్ణయించుకున్నారు. తన పోరాటానికి మద్దతు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కానీ కీలకమైన వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేదు. కానీ అనూహ్యంగా సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్, శివసేన యుబిటి ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, ఐయూఎమ్ఎల్ ప్రతినిధులు అబ్దుల్ వాహబ్, హ్యరీష్, ఏఐఏడిఎంకె ఎంపీ చంద్రశేఖర్ మద్దతు ప్రకటించారు. ఇలా జాతీయ పార్టీల అనూహ్య మద్దతును ఆహ్వానించాలో.. సంతోషించాలో జగన్కు తెలియని పరిస్థితి. జగన్ కు మద్దతు తెలిపిన పార్టీలన్నీ ఇండియా కూటమిలోనివే. పైగా బీజేపీకి బద్ధ శత్రువులు. ఈ పరిణామంతో బిజెపితో ఉన్న చిన్నపాటి అనుబంధం తెగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా బిజెపితో వైసిపి అనుబంధం కొనసాగించింది. ఇప్పుడు ఏపీలో తన బద్ధ శత్రువులుగా ఉన్న చంద్రబాబు, పవన్ లు ఎన్డీఏ లో ఉన్నా.. బిజెపితో మాత్రం శత్రుత్వం పెంచుకోకూడదని జగన్ భావించారు. కానీ ఈ ధర్నా పుణ్యమా అని బిజెపి వ్యతిరేకుల సాయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అది కచ్చితంగా కేంద్ర పెద్దలకు ఆగ్రహానికి గురిచేసే అంశమే.
* వెంటాడుతున్న కేసుల భయం
దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలది ఒక ఎత్తు. వైసీపీ ది మరో ఎత్తు. అవినీతి కేసులను ఎదుర్కొన్న జగన్ ప్రాంతీయ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ ఆ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు సైతం వెంటాడుతోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో వైఫల్యాలను కూటమి సర్కార్ బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. అక్రమాస్తుల కేసులు సైతం తెరపైకి వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అవసరం జగన్ కు ఉంది. అది తెలిసే ఎన్డీఏ ప్రభుత్వం విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ఎంపిక విషయంలో బిజెపి విన్నపాన్ని మన్నించారు. మద్దతు కూడా ప్రకటించారు.
* తాడోపేడోకు సిద్ధం
అయితే జగన్ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ విషయంలో అధికార విపక్షాల మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు విడిచిపెట్టడం సంప్రదాయంగా వస్తోంది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం బిజెపి డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు కేటాయించలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిప్యూటీ స్పీకర్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఇండియా కూటమి వైపు తాము వెళుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలిగారు. అటు ఇండియా కూటమి నుంచి పెద్ద ఎత్తున నేతలు వచ్చి ధర్నాకు సంఘీభావం తెలపడం, విజయసాయిరెడ్డి ప్రకటనతో కొంతవరకు క్లారిటీ వచ్చింది.
* క్లారిటీ వచ్చిన తరువాతనే..
ఏపీలో టీడీపీ కూటమితో బిజెపి వెళ్తోంది. ఎన్డీఏలో టిడిపి తో పాటు జనసేన ఉంది. ఎన్డీఏ సుస్థిరతకు టిడిపి అవసరం ఉంది. పైగా రాజకీయంగా చంద్రబాబుకు సహకారం అందుతోంది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టునకు అండగా నిలవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆపై కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. ఏపీ విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధతో ఉంది. దీంతో జగన్ కు తత్వం బోధపడింది. బిజెపి టిడిపి తో వెళ్లడానికి స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమితో వెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది. అందుకే ఆయన ఇండియా కూటమి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
* దూరదృష్టితో
2029 ఎన్నికల్లో సైతం ఏపీలో టిడిపి, బిజెపి, జనసేన పొత్తుతో ముందుకెళ్లడం ఖాయం. మొన్నటికి మొన్న మూడు పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ పూర్తిగా స్పష్టతనిచ్చారు. సుమారు 10 ఏళ్ల పాటు పొత్తు కొనసాగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయకత్వానికి మూడు పార్టీలు జై కొడుతున్నాయి. సంపూర్ణ సహకారం అందిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్, వామపక్షాలు జగన్ కు కనిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో వాటితో సఖ్యత లేదు. అది కావాలంటే ఇండియా కూటమిలో చేరడం అనివార్యంగా మారింది. దానికి సంకేతాలు ఇచ్చేందుకే జగన్ ధర్నాకు ఇండియా కూటమి నేతలకు ఆహ్వానించినట్లు సమాచారం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More