Geethanjali Incident: ఏపీలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత హననానికి పాల్పడడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఏకంగా గీతాంజలి కి మద్దతుగా ఒక క్యాంపెయిన్ కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. దీనిపై ఏపీ సర్కార్ సత్వరం స్పందించింది. బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించడం విశేషం.
ఈ నెల నాలుగున ఏపీ సర్కార్ అందించిన ఇంటి పట్టాను గీతాంజలి అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ తన సంతోషాన్ని, సంతృప్తిని ఆమె వెల్లడించారు. తనకు అమ్మ ఒడితో పాటు ఇంటి పట్టా కూడా వచ్చినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో ఆమె చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆమె ట్రోలింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మనస్థాపానికి గురయ్యారు. క్షణికావేసానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. గీతాంజలి మృతితో ఇద్దరు పిల్లలు అనాధలుగా మిగిలారు. ఆమె ఆత్మహత్యకు ఐటిడిపి, జనసేన సోషల్ మీడియాలే కారణమని వైసిపి ఆరోపిస్తోంది. అటు పోలీసులు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు వల్లే ఆమె మనస్థాపానికి గురైనట్లు గుర్తించారు. పంచనామాలో కూడా ఇదే విషయాన్ని పొందుపరిచారు. ప్రస్తుతం ఆమెను టార్గెట్ చేసిన సోషల్ మీడియా పోస్టులను, సంబంధిత అకౌంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ పథకాలను మెచ్చుకున్నందునే ఆమెను టార్గెట్ చేశారని మంత్రి రోజా ఆరోపించారు. ముమ్మాటికి దీనికి కారణం టిడిపి,జనసేన సోషల్ మీడియా విభాగాలే అంటూ ఆరోపణలు చేశారు. మరోవైపు సీఎం జగన్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మరోవైపు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో వచ్చిన పాజిటివ్ కామెంట్స్ పైనే ఆమె షేర్ చేసుకున్నారని..కానీ నెగిటివ్ కామెంట్స్ పై ఆమె మా దృష్టికి తీసుకు రాలేదని భర్త చెబుతున్నారు. మొత్తానికైతే గీతాంజలి విషాదాంతం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మున్ముందు ఎటువంటి పరిణామాలకు ఈ ఘటన దారితీస్తుందో చూడాలి.