Jagan shock to Alla: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం వెంటాడుతోంది. కేసులతోపాటు అరెస్టులు జరుగుతుండడంతో దూకుడు కలిగిన నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు కూడా భయపడిపోతున్నారు. వైసీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి.. ఒక ఆట ఆడేసుకున్న నేతలు సైతం ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. అటువంటి వారిలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి. ఈ ఇద్దరు సోదరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేసేవారు. అయితే తమను జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకున్నారే తప్ప.. తమకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించలేదన్న ఆందోళన, ఆవేదన ఆ ఇద్దరు నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన అయోధ్య రామిరెడ్డి పార్టీ మారుతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అరెస్టుల భయంతోనే ఆయన దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
పార్టీ ఆవిర్భావం నుంచి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వస్తున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి 2014లో పిలిచి మంగళగిరి టిక్కెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. అయితే మంగళగిరి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది చంద్రబాబు ప్రభుత్వం. కానీ ఆ సమయంలో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా దూకుడుగా వ్యవహరించారు. అప్పటి చంద్రబాబుపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసేవారు. పెద్ద ఎత్తున కేసులు వేసేవారు. 2019 వరకు అదే దూకుడు కనబరిచారు. 2019లో రెండోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు రామకృష్ణారెడ్డి. జగన్ పిలిచి మంత్రి పదవి ఇస్తారని భావించారు. కానీ జగన్ మాత్రం పట్టించుకోలేదు.
గత ఎన్నికల్లో నో ఛాన్స్..
దాదాపు పది సంవత్సరాలు పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తే.. 2024 ఎన్నికలకు ముందు టిక్కెట్ లేదని తేల్చేశారు జగన్మోహన్ రెడ్డి. మంగళగిరి టిక్కెట్ దక్కకపోయేసరికి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు రామకృష్ణారెడ్డి. వెంటనే షర్మిల పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ అక్కడ ఎన్నో రోజులు ఉండలేకపోయారు. తిరిగి జగన్ గూటికి వచ్చేసారు. అయితే ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఫుల్ సైలెంట్ అయ్యారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలపై కేసుల విషయంలో ముందుండే వారు రామకృష్ణారెడ్డి. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం, కేంద్రంలో ఎన్డీఏ కీలక భాగస్వామి కావడంతో తన అరెస్ట్ ఉంటుందని అనుమానిస్తున్నారు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
సత్తెనపల్లి కోసం పట్టు..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి సైతం ఆళ్ల రామకృష్ణారెడ్డిని మోసం చేసినట్లు ప్రచారం నడుస్తోంది. మంగళగిరి నుంచి తప్పించిన రామకృష్ణారెడ్డి తనకు సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సత్తెనపల్లి టిక్కెట్ విషయంలో మాజీమంత్రి అంబటి రాంబాబుకు హామీ ఇచ్చారు జగన్. ఆ హామీ తప్పితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలుసు. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నో చెప్పినట్లు సమాచారం. అందుకే ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేందుకు ఆల రామకృష్ణారెడ్డి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.