Jagan And KCR: చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వత ప్రయోజనాలను చేతులారా ధ్వంసం చేయకూడదు. అయితే ఈ విషయంలో తెలంగాణలోని కెసిఆర్, ఏపీలోని జగన్మోహన్ రెడ్డి చేజేతులా తప్పటడుగులు వేశారు. ఉమ్మడి శత్రువును దృష్టిలో పెట్టుకొని ఈ ఇద్దరు నేతలు చేతులు కలిపారు. అయితే కెసిఆర్ను రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించగా.. ఆయన కుమారుడు మాత్రం రాజకీయ గురువుగా ఎంచుకున్నారు. అయితే వారిద్దరి మధ్య స్నేహం ప్రారంభంలో లబ్ధి చేకూర్చింది కానీ.. ప్రస్తుతం మాత్రం పాతాళానికి తోసేసింది. ఆ ఇద్దరి మధ్య స్నేహాన్ని ఇటు ఏపీ ప్రజలు.. అటు తెలంగాణ ప్రజలు ఎంత మాత్రం హర్షించడం లేదు. దానికి కారణం కేసీఆర్ అయితే.. ఆయన సలహాలతో జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ రెండు పార్టీల పాలిట శాపంగా మారాయి.
* ఉమ్మడి ఆస్తులు రాసి ఇచ్చేశారు..
ప్రజలకు నేను ఎంత చెబితే అంత అన్నట్టు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy). ఒకే ఒక్క సంతకంతో హైదరాబాదులో ఉన్న ఉమ్మడి ఆస్తులను తెలంగాణకు రాసిచ్చేశారు. తద్వారా తనకు ఏపీలో వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని.. అలా తన స్నేహితులు తీసుకోవడం ద్వారా తెలంగాణ ప్రజలు హర్షిస్తారని భావించారు. కానీ అంతకంటే ముందే కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో విద్వేశం రెచ్చగొట్టారు. ఏపీ ప్రజల గుండెలను గాయపరిచారు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ తో చెలిమి చేశారు. అన్నింటికీ మించి ఆ కుటుంబ అహంకారంతో రెచ్చిపోవడంతో కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. అదే సమయంలో ఉమ్మడి ఆస్తులను తెలంగాణకు కట్టబెట్టి ఏపీ భవిష్యత్తును అంధకారంలో నెట్టారని ఏపీ ప్రజలు గుర్తించారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడించారు.
* మూడు రాజధానుల విషయంలో..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. అందరి అభిప్రాయంతో అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ను ఆహ్వానించారు చంద్రబాబు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు అమరావతి నిర్మాణం కావాలని కెసిఆర్ ఆకాంక్షించారు. కానీ అదే కెసిఆర్.. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం వెనుక పెద్దన్న పాత్ర పోషించారు. తద్వారా తెలంగాణ రాజధానికి ధీటుగా తయారవుతున్న అమరావతిని నిర్వీర్యం చేయడంలో కెసిఆర్ సైతం చేయి కలిపారు. అయితే సంక్షేమ పథకాలతో ప్రజలు తనను ఓటు వేస్తారని చెప్పి.. తెర వెనుక రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో కెసిఆర్ గెలవాలని 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో సరికొత్త ఆలోచన చేశారు. ఏపీ పోలీసులను నాగార్జునసాగర్ పై పంపించి సానుభూతి పనిచేసేలా వ్యవహరించారు కానీ.. అవేవీ వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు తమ మధ్య ఉన్న స్నేహాన్ని వదులుకోలేరు. కొనసాగించలేరు.. ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.