Jagan Tadepalli: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) విదేశీ పర్యటన ముగిసింది. కొద్దిరోజులుగా లండన్ లో జగన్ దంపతులు పర్యటించిన సంగతి తెలిసిందే. నిన్ననే వారు బెంగళూరు చేరుకున్నారు. దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లి కి రానున్నారు జగన్. వరుసగా భేటీలతో పాటు పార్టీ శ్రేణులతో సమకాలీన అంశాలపై చర్చించనున్నారు. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలోనే నకిలీ మద్యం ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో కూటమికి ఇబ్బందులు తప్పవని అంతా భావించారు. కానీ ఇప్పుడు అదే అంశము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంది. ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనిపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది.
* కల్తీ మద్యం కేసులో అడ్డంగా
ఏపీలో( Andhra Pradesh) నకిలీ మద్యం ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ హడావిడి చేశారు. రాష్ట్రంలో ఏ మాజీ మంత్రి కూడా అంతలా స్పందించలేదు. ఎప్పుడైతే ఆ కేసులో ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడో.. జోగి రమేష్ గురించి అన్ని అంశాలను బయటపెట్టాడు. ఆయన ప్రోత్సాహంతోనే తాము కల్తీ మద్యం తయారు చేసినట్లు ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ప్రకటించారు. ప్రత్యేక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంది కూటమి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి స్థానికంగా లేరు. ఇప్పుడు అదే అంశంపై తాడేపల్లిలో పార్టీ శ్రేణులకు జగన్ నిర్దేశం చేసే అవకాశం ఉంది.
* ప్రధాని సభ సక్సెస్ తో..
జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే రాయలసీమలో( Rayalaseema) జీఎస్టీ సక్సెస్ సభ జరిగింది. కర్నూలులో నిర్వహించిన ఈ సభ విజయవంతం అయింది. గత 16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వంతో పాటు మిత్రపక్షాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రధాని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని పవన్ ప్రకటించారు. తద్వారా ఆ మూడు పార్టీలు మైత్రితో కొనసాగుతాయని స్పష్టమైంది. తప్పకుండా అధికార కూటమి పట్టు బిగిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. రాయలసీమలో సైతం పట్టు తప్పుతోందని వైసీపీ నేతలు ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు జగన్ దానిపై కూడా చర్చిస్తారు. ప్రధాని సభ ఫీడ్బ్యాక్ తెలుసుకుంటారు. అయితే వైసిపి ఒంటరి పోరాటానికి ఎక్కువగా మొగ్గు చూపుతోంది. మిగతా రాజకీయ పక్షాలతో కలిసే ఛాన్స్ లేదు. అందుకే ఈరోజు భవిష్యత్ కార్యాచరణ పై జగన్ ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు. జనాల్లోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.