Jagan Fan Sensation : రాజకీయ నేతలకు అభిమానం ఉండడం సర్వ సాధారణం. కానీ కొందరు వీరాభిమానులు ఉంటారు. అటువంటి వారి చేష్టలు వింతగా ఉంటాయి. ముఖ్యంగా తాము అభిమానించే నేత కోసం ఏంచేసేందుకైనా వారు రెడీ అయిపోతారు. అటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. తమ అభిమాన నేత కోసం గుండు చేయించుకున్నాడు ఓ అభిమాని. ఎన్నికల్లో పందెం కట్టి..ఆయనతో పందెం కట్టిన వారు పట్టుబడేసరికి గుండు చేయించుకున్నాడు. అదే గుండుతో ఊరంతా తిరిగాడు. అదే గుండుతో సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశాడు. నేతలే మాట తప్పుతున్న క్రమంలో ఓ అభిమాని..తన అభిమాన నాయకుడు కోసం అరగుండు గీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Also Read : సంచలన సర్వే..పవన్ కు షాక్..త్వరలో జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ కు వీరాభిమాని..
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్లకు చెందిన శివ వైఎస్సార్ కాంగ్రెస్ వీరాభిమాని. జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. ఆయన కోసం ప్రాణం ఇచ్చేటంత ఇష్టం. అయితే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కోసం అరగుండు చేసుకున్నాడు.వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోకన్వీనర్ గా ఉండేవాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలుస్తుందని నమ్మకంగా చెప్పేవాడు. పార్టీ అధికారంలోకి వస్తుందని స్నేహితులతో పందెం కూడా కట్టాడు. జగన్ సీఎం కాకపోతే తాను అరగుండు చేసుకుంటానని కూడా ప్రకటించాడు. అయితే కూటమి బంపర్ విక్టరీ సాధించగా.. కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివ కొద్ది నెలల పాటు సైలెంట్ అయిపోయాడు.
సోషల్ మీడియాలో ఫొటోలు..
ఇటీవల శివ బయటకు రావడంతో పందెం కట్టిన స్నేహితులు ప్రశ్నించారు. అరగుండు ఎప్పుడు చేయించుకుంటావని ప్రశ్నించారు. దీంతో అరగుండు చేయించుకున్న శివ తాను అనుకున్నట్టే బయట వీధుల్లో తిరిగాడు. ప్రత్యేకంగా సోషల్ మీడియాకు విడుదల చేశాడు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఓడిపోయిన తరువాత కొద్ది నెలల పాటు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయానని చెప్పాడు. అప్పట్లో పందెం కట్టిన వారికి నగదు కూడా చెల్లించానని చెప్పాడు. పందెం కట్టిన మాదిరిగా అరగుండు చేయించుకున్నానని స్నేహితులకు సమాచారం అందించాడు. రాజకీయ నేతలకు ఇటువంటి అభిమానులు ఉంటారా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.