AP CM YS Jagan : ఏపీ సీఎం జగన్ మరోసారి ఫైరయ్యారు. విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ లను టార్గెట్ చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కొవ్వూరు వేదికైంది. జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల అనంతరం జగన్ మాట్లాడారు. వచ్చే ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తాయని చెప్పారు. తనను ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా వస్తున్నారని…తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని అన్నారు. ఇది కులాల మధ్య యుద్ధం కాదని..పేదవాడు ఒక వైపు.. పెత్తందార్లు మరోవైపు ఉన్నారని చెప్పుకొచ్చారు. మంచి జరిగిందా? లేదా? అన్నదే భేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు.
మరోసారి క్లాస్ వార్ ను సీఎం జగన్ తెరపైకి తెచ్చారు. గతంలో చేసిన వ్యాఖ్యలనే మళ్లీ చేశారు. గత పాలకులు గజదొంగల ముఠాగా రాష్ట్రాన్ని పంచుకున్నారని గుర్తుచేశారు. తమ ఆటలు సాగవనే తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని చెప్పకొచ్చారు. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న క్లాస్ వార్ లో ఎవరికి మద్దతు పలుకుతారో తెల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుందని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత వైసీపీ సర్కారుదేనన్నారు. ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్యే తెలియజేస్తుందన్నారు. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశామని చెప్పారు. జాబ్ ఓరియోంటెడ్‌గా కరిక్యులమ్ మార్చామని… దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టామన్నారు పిల్లల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామన్నామని గుర్తుచేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒక సత్యనాదేళ్ల రావాలని ఆకాంక్షించారు. ప్రతిపక్షాలకు ప్రజల గురించి ఆలోచన లేదని… వారి ఆలోచన అంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమనేని జగన్ విమర్శించారు..
మరోసారి దత్తపుత్రుడు అంటూ పవన్ పై పరోక్ష విమర్శలు చేశారు. చంద్రబాబుకు మాదిరిగా దత్తపుత్రుడు, ఎల్లోమీడియా సపోర్టు లేదని జగన్ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా గుర్తించాలన్నారు.ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు బటన్ నొక్కి రూ.3 లక్షల కోట్లు నేరుగా జమ చేశామని చెప్పుకొచ్చారు.మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ జగనన్నకు తోడుగా మీరే సైనికులు కండంటూ అభ్యర్ధించారు. తన బలం మీరు, ఈ రోజు తన నమ్మకం మీరు అని తేల్చిచెప్పారు. మీ చల్లని దీవెనలు తమకు ఉండాలని స్పష్టం చేశారు.