Jagan and Balakrishna : వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టారు అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులను సైతం ప్రకటించారు. దీంతో నేతలంతా బాధ్యతలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడుగా బాధ్యతలు స్వీకరించారు కదిరి బాబురావు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాబురావుకు విశాఖ పార్లమెంటరీ పరిశీలకుడుగా నియామకం వెనుక జగన్ భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణల దృష్ట్యా కదిరి బాబురావు నియామకం చేసినట్లు సమాచారం. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆపై నందమూరి బాలకృష్ణ కు అత్యంత సన్నిహితుడు కూడా. 2019 ఎన్నికల తర్వాత ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
Also Read : జగన్మోహన్ రెడ్డి అరెస్ట్.. ముహూర్తం ఫిక్స్!
* సామాజిక కోణంలో..
ఉత్తరాంధ్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబును( kurasala kannababu ) నియమించిన సంగతి తెలిసిందే. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఉత్తరాంధ్రలో ఆ సామాజిక వర్గం ఎక్కువ. అందుకే విజయసాయి రెడ్డి స్థానంలో కన్నబాబును నియమించారు జగన్. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ పదవులతో పాటు రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. దీంతో ఇక్కడ సమర్ధుడైన నేతను నియమించాలని జగన్ భావించారు. కురసాల కన్నబాబు అయితే సరిపోతారని భావించారు. అయితే ఇప్పుడు కన్నబాబు ఉండగా కాపు సామాజిక వర్గానికి చెందిన కదిరి బాబురావును పరిశీలకుడుగా నియమించడం విశేషం.
* సీనియర్ రాజకీయ నాయకుడిగా..
ప్రకాశం జిల్లాకు చెందిన కదిరి బాబురావు( Kadiri Baburao ) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కు ఆయన అత్యంత సన్నిహితుడు కూడా. 2004లో తొలిసారిగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు బాబురావు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో టిడిపి టికెట్ ఇవ్వడంతో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే స్క్రూట్నీలో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 2014లో కనిగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే 2019 ఎన్నికల్లో కనిగిరి టికెట్ ఆయనకు లభించలేదు. దర్శి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. అసంతృప్తిగానే పోటీ చేసిన కదిరి బాబురావు ఓడిపోయారు. అక్కడకు కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తప్పలేదు.
Also Read : పరిస్థితి మారుతోంది.. బెంగళూరులో జగన్.. లాయర్లతో భేటీ!
* టిడిపిలో చేరుతారని ప్రచారం..
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కదిరి బాబురావు తిరిగి టిడిపిలో( Telugu Desam Party) చేరతారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి విశాఖ పార్లమెంటరీ పరిశీలకుడిగా నియమించడంతో ఆ బాధ్యతలు స్వీకరించారు కదిరి బాబురావు. విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భారీ సమావేశం నిర్వహించారు. విశాఖను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారుద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ సన్నిహిత నేత ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.