Jagan
Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి ఒక 11 మంది శాసనసభ్యులు పిలిచారు. అందులో ఓ ఐదుగురు వరకు సీనియర్లు. మిగతా వారంతా జూనియర్లే. తొలిసారిగా ఎన్నికైన వారే. అది కూడా రిజర్వుడు నియోజకవర్గాల నుంచి గెలిచిన వారే. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వారి పాలిట శాపంగా మారింది. అసెంబ్లీకి వెళ్లి దర్జా చూపాలన్న వారి ఆశలను నీరుగార్చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కనీసం రిజిస్టర్లో సంతకాలు చేస్తే తమ పదవులు ఉంటాయని.. తమకు జీతభత్యాలు అందుతాయని.. ఇతర అలవెన్సులు కలిసి వస్తాయని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అది కూడా వివాదాస్పదం కావడం.. జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేయడం వారికి రుచించడం లేదు. అమ్మ తినను తినదు.. అడుక్కోనివ్వదు అన్నట్టు ఉంది వారి పరిస్థితి.
* ఐదుగురు తప్ప
ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బాల నాగిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి.. వంటి నేతలే గెలిచారు. మిగతా వారంతా రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి విజయం సాధించిన వారే. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రయోగాల్లో భాగంగా కొత్తగా తెరపైకి వచ్చిన వారే. వారు ఎన్నో ఆశలతో సభలో అడుగు పెట్టాలని భావించారు. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో సభను బహిష్కరించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఎమ్మెల్యేలు మాత్రం సభపై పూర్తి ఇష్టతతో ఉన్నారు. సభలోకి వచ్చేందుకు ఆత్రుత కనబరుస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మొండి పట్టుదలతో ఉండిపోయారు.
* లోలోపల బాధ
అసలు శాసనసభకు( assembly) హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు అని వారంతా బాధపడుతున్నట్లు సమాచారం. గత ఐదేళ్లుగా వైసిపి పాలనలో ఎంతోమంది సంపాదించుకున్నారు. అటువంటి వారిని 2024 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తమలాంటి కొత్తవారిని ఎంతో ఆశలతో గెలిపిస్తే.. శాసనసభలో వాయిస్ వినిపించే అవకాశం లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం అని వారు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా శాసనసభ రిజిస్టర్లో సంతకాలు చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టడాన్ని వారంతా సహించుకోలేకపోతున్నట్లు సమాచారం.
* అనర్హత వేటు భయంతో..
వరుసగా 60 రోజులపాటు శాసనసభకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు( speaker Ayyannapatrudu ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అంతటి కూటమి ప్రభంజనంలో సైతం గెలిచామని.. మరోసారి వేటు పడితే.. ఉప ఎన్నికల్లో విజయం సాధించే ఛాన్స్ లేదని వారు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రిజిస్టర్లో సంతకాలు చేసినట్లు సమాచారం.