YS Jagan : జగన్ విదేశాలకు వెళ్తారా? అక్కడే కొద్ది రోజులు పాటు ఉండిపోతారా? అందుకే పాస్ పోర్ట్ రెన్యువల్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బెంగళూరు వెళ్ళిన జగన్ మూడు రోజుల కిందట ఏపీకి వచ్చారు. వెంటనే తన పాస్పోర్ట్ రెన్యువల్ పై దృష్టి పెట్టారు. వాస్తవానికి ఆయన పాస్ పోర్ట్ కోర్టు దగ్గర ఉంటుంది. అక్రమాస్తుల కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కోర్టు అనుమతి తీసుకోవాలి. సీఎంగా ఉన్నప్పుడు ఆయన డిప్లోమాట్ పాస్ పోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు సీఎంగా లేరు కాబట్టి ఆ పాస్ పోర్ట్ పనిచేయదు. అందుకే పాత పాస్ పోర్ట్ ను రెన్యువల్ చేయించుకున్నారు. ఆయన లండన్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. గత ఐదేళ్లు కాలంగా ప్రతి ఏటా జగన్ దంపతులు లండన్ వెళ్లేవారు. ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కూటమి ప్రభుత్వంపై పోరాటం చేద్దామంటే పార్టీ శ్రేణులు సైతం పెద్దగా ఇష్టపడడం లేదు. కొందరైతే కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని సూచిస్తున్నారు. అందుకే జగన్ బెంగళూరుకు పరిమితం కావాలని భావించారు. అయితే అక్కడ ఉండడం కూడా ఏమంత సేఫ్ కాదని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పిల్లలు లండన్ లో ఉన్నందున అక్కడే కొద్ది రోజులపాటు వారితో గడపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
* ఆ రెండు కారణాలు ఇవే
జగన్ విదేశాలకు వెళ్లడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ సర్కార్ వైఫల్యాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వరుసగా సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన అవినీతిని ఎండగడుతున్నారు. భారీగా అవినీతి, దోపిడీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై విచారణ సైతం చేపట్టడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు పాత అక్రమాస్తుల కేసులు బయటకు వస్తున్నాయి. బాబాయి వివేకానంద హత్య కేసు సైతం తెరపైకి వస్తోంది. అందుకే జగన్ సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకు విదేశాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
* ఓటమి బాధతో శ్రేణులు
ప్రస్తుతం వైసీపీ ఓటమి బాధతో ఉంది. పార్టీ శ్రేణులు సైతం బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. సీనియర్లు సైతం ముఖం చాటేస్తున్నారు. ధర్మాన లాంటివారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతారని తెలుస్తోంది. కొద్దిరోజుల పాటు రాజకీయాలను పరిశీలించి.. అప్పుడు యాక్టివ్ గా మారాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో ఎవరు ఉంటారో? ఎవరు ఉండరో? తెలియని పరిస్థితి. అందుకే కొద్ది రోజులు ఆగితే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. పార్టీ గ్రాఫ్ పై స్పష్టత వస్తుంది. అటు తరువాత పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది.
* కోర్టు అనుమతి ఇస్తుందా
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు లాంగ్ లీవ్ కోర్టు నుంచి లభిస్తుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. అయితే ఇప్పటికే లండన్ లో జగన్ నివాసానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పాస్ పోర్ట్ రెన్యువల్ చేసుకున్న జగన్ శుక్రవారం బెంగళూరు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల కాలంలో తాడేపల్లి ప్యాలెస్ ను విడిచిపెట్టని జగన్.. ఇప్పుడు మాత్రం తరచూ బెంగళూరులోనే గడుపుతుండడం విశేషం.