AP Birth And Death Certificates: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం పౌర సేవలను మరింత సులభతరం చేస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ అమలు చేస్తోంది. వందలాదిగా పౌర సేవలను సౌలభ్యంగా పొందే ఛాన్స్ కల్పించింది ఇప్పుడు తాజాగా ధ్రువపత్రాల జారీ విషయంలో నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జనన,మరణ ధ్రువపత్రాల జారీని సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టినా, చనిపోయినా అక్కడే ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి జారీ చేస్తారు. అవసరం అయినప్పుడు దరఖాస్తు చేసుకుంటే పంచాయితీ ఈవో సంతకంతో ఈ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నడుస్తూ ఉంటుంది.
* వివరాలు లేని వారికి..
వాస్తవానికి 2016కు ముందు పుట్టిన వారి వివరాలు ఆన్లైన్ లో( online) కనిపించడం లేదు. అటువంటివారికి యూనిఫైడ్ బర్త్, డెత్ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలి. పంచాయితీ రికార్డులు పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అయితే ఆ రికార్డుల్లో వివరాలు లేకపోతే.. నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ కోసం సచివాలయాల్లో కానీ.. మీసేవ కేంద్రాల్లో కానీ దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు వీర్చారించి ధ్రువపత్రాలు జారీచేస్తారు. అయితే ఒక్కసారి నమోదైన పేర్లను పూర్తిగా మార్చడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఒకవేళ అటువంటి తప్పిదాలు జరిగితే లీగల్ అఫిడవిట్ తప్పనిసరి. ఇంటిలో పుట్టినా.. చనిపోయినా పూర్తి ఆధారాలతో 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే అధికారులు విచారించి ధ్రువపత్రాలు జారీ చేస్తారు. ఈ లోపు పేర్లు చిరునామా తప్పుగా ఉంటే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా ఎటువంటి రికార్డులు లేని జనన, మరణాల వివరాలను అధికారికంగా నమోదు చేసుకోవచ్చు. ఇది ప్రజలకు సులభతరం, ఎంతో ప్రయోజనకరం కూడా.
* ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం..
మరోవైపు ఏపీలో కుల ధ్రువీకరణ( caste certificate ) పత్రాల జారీని మరింత సులభతరం చేస్తూ అందిస్తోంది ప్రభుత్వం. దరఖాస్తు చేసుకోకపోయినా ప్రభుత్వమే నేరుగా ఇంటికి తెచ్చి అందిస్తోంది. ఇంటింటా సర్వే ద్వారా వివరాలు సేకరించి ఈ పత్రాలను అందజేయనుంది. ఎటువంటి దరఖాస్తు చేయకపోయినా సుమోటోగా తీసుకొని ఈ పత్రాలు జారీ చేసేందుకు సిద్ధమయింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల వివరాలను సేకరిస్తున్నారు. ఈ సర్వేలో నమోదు చేసుకున్న వివరాలను అనుసరించి.. త్వరలోనే కుల ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు. గతంలో కుల ధ్రువీకరణ పత్రం కావాలంటే వీఆర్వో వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. తరువాత తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఇంటికి తెచ్చి ధ్రువీకరణ పత్రం అందించే ఏర్పాట్లు చేయడం నిజంగా హర్షించదగ్గ పరిణామం.