AP Congress: కాంగ్రెస్ లోకి జగన్.. రాహుల్ ఫోన్ చేసి మంత్రాంగం?

2019 ఎన్నికల్లో అంతులేని విజయంతో దేశం నివ్వెర పోయేలా అందర్నీ ఆకట్టుకుంది వైసిపి. 2024 ఎన్నికల్లో ఓటమితో జాతీయస్థాయిలో వైసిపి చర్చకు కారణమైంది. అయితే వైసిపి ఓడిపోయినా 40 శాతం ఓటు సాధించింది.

Written By: Raj Shekar, Updated On : July 3, 2024 10:03 am

AP Congres

Follow us on

AP Congress: పేరుకే వైసీపీ కానీ.. అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ నేతలే. క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీదే. అందుకే విపక్షాలు వైసీపీని పిల్ల కాంగ్రెస్ తో పోలుస్తాయి. రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ పతనం కావడం వల్లే.. వైసిపి బలోపేతం అయ్యింది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసింది. 2014లో వైసిపి విపక్షానికి పరిమితం కాగా.. 2019లో అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. దారుణ పరాజయంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ నేతలు సైతం పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం. వైసీపీలో సీనియర్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

2019 ఎన్నికల్లో అంతులేని విజయంతో దేశం నివ్వెర పోయేలా అందర్నీ ఆకట్టుకుంది వైసిపి. 2024 ఎన్నికల్లో ఓటమితో జాతీయస్థాయిలో వైసిపి చర్చకు కారణమైంది. అయితే వైసిపి ఓడిపోయినా 40 శాతం ఓటు సాధించింది. అందుకే వైసీపీని తనవైపు తిప్పుకునేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగాకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు.నేరుగా వైసీపీ సీనియర్లకు ఫోన్ చేసి కాంగ్రెస్ లో చేరాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైసిపి సీనియర్ నేతలు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

వైసీపీలో సీనియర్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్ వంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. బొత్స, ధర్మాన లాంటివారు తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో పని చేయాల్సి వచ్చింది. వీరంతా దివంగత రాజశేఖరరెడ్డి సమకాలీకులు. జగన్ నుంచి ఆశించిన స్థాయిలో వీరికి గౌరవం లేదు. అలాగని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక వీరికి కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ మనుగడ లేకపోవడంతో.. అనివార్య పరిస్థితుల్లో వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసిపి పతనం అంచున ఉండడంతో మీరు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడడంతో వీరు మెత్తబడినట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ నుంచి చాలామంది సీనియర్లు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అంతకంటే ముందే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. గణనీయమైన ఎంపీ సీట్లు కూడా సాధించింది. జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి ధీటుగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలోపేతం అయ్యింది. ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ ఏపీ ఫై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. అవసరమైతే జగన్ ను సైతం కాంగ్రెస్ లోకి రప్పించేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. ఇప్పుడు జాతీయస్థాయిలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించేందుకు భారీ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. జగన్ ఒప్పుకుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.