CM Jagan: తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ కు ఎదురైన ఓటమి నుంచి జగన్ ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నారు. తన విషయంలో అవి ఎదురు కాకుండా చూడాలని భావిస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మార్చుతున్నారు. కెసిఆర్ ఆ పని చేయకపోవడం వల్లే ఓడిపోయారని విశ్లేషణలు జరిగిన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయానికి వచ్చారు. మరోవైపు కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్లే నష్టపోయారని ఒక అంచనా ఉంది. అందుకే ఏపీలో ఎన్నికల ముంగిట జనాల మధ్య ఉండాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేశారు జగన్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 151 అసెంబ్లీ స్థానాలను పొందగలిగారు. దీనికి ముమ్మాటికి పాదయాత్ర కారణమని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. విపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయడంతో పాటు అప్పుడప్పుడు నిరసన దీక్షలు చేపట్టేవారు. అవి జగన్ ను ప్రజలకు దగ్గర చేసి.. విజయాన్ని కట్టబెట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 175 స్థానాలకు 175 సీట్లు రావాలని జగన్ కోరుకుంటున్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నారు. అయితే ఇది బస్సు యాత్ర, లేకుంటే ఇతరత్రా ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా అన్నదానిపై మరో పది రోజుల్లో క్లారిటీ రానుంది.
ప్రస్తుతం సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఎప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 11మంది అభ్యర్థులను మార్చుతూ తొలి జాబితాను విడుదల చేశారు. మరో 50 మందిని మార్చి రెండో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు జనవరి 21 నాటికి ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చనే ప్రచారం ఉంది. ఇంతలో వీలైనన్ని పథకాలు ప్రారంభించి ప్రజల మనసు గెలుచుకోవాలని జగన్ చూస్తున్నారు. అటు తరువాత ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.ప్రతిపక్ష టిడిపి, జనసేనలను టార్గెట్ చేయనున్నారు. గత ప్రభుత్వాలకు, తన ప్రభుత్వం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని ప్రజలను కోరనున్నారు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.
తన మూడేళ్ల పాలన పూర్తయిన వరకు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదన్నకామెంట్స్ వినిపించాయి. దీంతో ఇప్పుడిప్పుడే ఆయన బయటకు వస్తున్నారు. కానీ ప్రజలను కలిసేందుకు మాత్రం ఇష్టపడడం లేదు. ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు రేగడంతో జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నారు. ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అందుకే కెసిఆర్ కు ఎదురైన ప్రతికూల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్న జగన్.. విపక్షాలకు ఏ ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. అయితే త్వరలో జగన్ రాష్ట్రస్థాయి పర్యటనపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.