Mega Family: సినిమా రంగంలో మకుటం లేని మహారాజు చిరంజీవి. బ్యాక్ బోన్ లేకపోయినా స్వయంకృషితో ఎదిగారు ఆయన. 50 సంవత్సరాల సినీ జీవితానికి దగ్గరగా ఉన్నారు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి ఎంతోమంది హీరోల ఎంట్రీకి కారణమయ్యారు. మరికొన్ని దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలగల సత్తా ఆ కుటుంబానికి ఉంది. కానీ సినీ రంగంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న చిరంజీవి.. అగ్ర హీరోగా వెలుగొందిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. ఎన్టీఆర్ అంతటి సినీ గ్లామర్ ఉన్నా.. ప్రేక్షక ఆదరణ పొందినా.. రాజకీయాల్లో మాత్రం ఆదరణ పొందలేకపోయారు. కానీ 70 లక్షల ఓట్లతో.. 18 సీట్లతో మంచి ఉనికి చాటుకున్నారు. సరైన సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోవడమే చిరంజీవికి మైనస్ గా మారింది. అంతకంటే మించి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం బలమైన తప్పిదంగా నిలిచింది.
2014 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం ఉంటే.. ఆ పార్టీ ఏపీలో కీలక భూమిక వహించేది. ప్రజల గుండెల్లో కొంతవరకు స్థానం దక్కించుకొని ఉండేది.కానీ చిరంజీవి ఆలోచన ఏదీ కలిసి రాలేదు. సరైన సమయంలో అడుగులు వేయలేదు. ఏ సపోర్ట్ లేకుండా స్వశక్తితో సినిమాల్లో రాణించవచ్చు కానీ.. రాజకీయాల్లో అలా కాదు. ప్రజల మనసును గుర్తించాలి. అందుకు తగ్గట్టు వ్యూహాలు రూపొందించుకోవాలి. అంతకుమించి ప్రజల అంచనాలను అందుకో గలగాలి. వీటన్నింటిలో చిరంజీవి వెనుకబడడంతోనే రాజకీయంగా కలిసి రాలేదు. రాజకీయాలకు కేవలం చరిష్మ కాదు.. అంతకుమించి ప్రజాక్షేత్రంలో నిత్యం ఉండాలి. ఈ విషయం తెలియక.. ఎన్టీఆర్ మాదిరిగా.. నెలల వ్యవధిలో అధికారంలోకి వస్తామని చిరంజీవి భావించారు. కానీ అలా జరగలేదు. టిడిపి ఎంట్రీ సమయంలో ఉండే రాజకీయ అనిశ్చితి.. 2009లో లేదు.
చిరంజీవి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న పవన్ జనసేన ను ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం పోరాడుతున్నారు. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య జనసేన ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అష్ట కష్టాలు పడ్డారు. అందుకే ఒంటరి ప్రయాణం కంటే.. తెలుగుదేశం పార్టీతో జత కట్టడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. అప్పుడే జనసేన నిలబడుతుందని.. సుదీర్ఘకాలం మనగలుగుతుందని భావిస్తున్నారు. అయితే సినీ రంగంలో ఏలిన మెగా కుటుంబానికి.. తమ చిరకాల వాంఛ అయిన రాజకీయ ఆధిపత్యంఇప్పుడు కీలకంగా మారింది.అందుకే ముందుగా నాగబాబు వచ్చి పవన్ కు అండగా నిలబడ్డారు. ఇప్పుడు చిరంజీవి పరోక్ష మద్దతు తెలిపారు. టిడిపి కూటమి అధికారంలోకి వస్తే.. వైసీపీ ఖాళీ అవుతుందని పవన్ ఆలోచన పెట్టుకున్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేసి జనసేన ను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ ఆలోచనతోనే మెగాస్టార్ తో పాటు మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన హీరోలు, బుల్లితెర నటులు జనసేనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మెగా కుటుంబానికి రాజకీయంగా ఇదో క్లిష్ట సమయంగా భావిస్తున్నారు. అందుకే పవన్ కు మద్దతుగా తలో చేయి వేస్తున్నారు.