Tammineni Sitaram: ఆ ఆనవాయితీని బ్రేక్ చేయలేకపోయిన తమ్మినేని..

1999 నుంచి ఏపీలో స్పీకర్ పదవులు చేపట్టిన వారు తర్వాతే ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చారు. 1999లో టిడిపి ప్రభుత్వ హయాంలో తొలి మహిళా స్పీకర్ గా ప్రతిభా భారతి ఎన్నికయ్యారు.

Written By: Dharma, Updated On : June 4, 2024 11:43 am

Tammineni Sitaram

Follow us on

Tammineni Sitaram: ఏపీ ఎన్నికల ఫలితాల్లో మరో సెంటిమెంట్ కొనసాగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటమితో స్పష్టమయ్యింది. 1999 నుంచి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్లుగా పనిచేసినవారు తరువాత ఎన్నికల్లో గెలిచింది లేదు. అందుకే స్పీకర్ పదవి అంటేనే చాలామంది భయపడి పోతున్నారు. అయితే ఈ సెంటిమెంట్ తెలంగాణలో పని చేయలేదు. 2018 ఎన్నికల్లో గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కూడా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత తమ్మినేని సీతారాంను జగన్ స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. తాజా ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఆమదాలవలస నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. స్పీకర్ పదవి చేపట్టిన వారు ఓడిపోతారని ఉన్న సెంటిమెంటును తెలంగాణ అధిగమించగా.. ఏపీలో మాత్రం కొనసాగడం విశేషం.

1999 నుంచి ఏపీలో స్పీకర్ పదవులు చేపట్టిన వారు తర్వాతే ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చారు. 1999లో టిడిపి ప్రభుత్వ హయాంలో తొలి మహిళా స్పీకర్ గా ప్రతిభా భారతి ఎన్నికయ్యారు. వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. స్పీకర్ పదవి చేపట్టాక ఆరోసారి పోటీ చేసి ఓడిపోయారు. 2004 నుంచి 2009 వరకు స్పీకర్గా కేతిరెడ్డి సురేష్ రెడ్డి పదవి చేపట్టారు. కానీ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009 నుంచి 2010 వరకు స్పీకర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పని చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆయన సీఎం పదవి చేపట్టారు. కానీ తరువాతే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2011 నుంచి 14 వరకు నాదెండ్ల మనోహర్ శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు.

నవ్యాంధ్రప్రదేశ్ కు తొలిసారిగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు స్పీకర్ అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. వైసీపీ సర్కార్ వెంటాడడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019లో ఆమదాలవలస ఎమ్మెల్యేగా విజయం సాధించిన తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి వరించింది. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటమి పలకరించింది. శాసనసభ స్పీకర్ గా ఉన్నవారు.. తరువాత ఎన్నికల్లో ఓడిపోతారన్న ఆనవాయితీని బ్రేక్ చేయలేకపోయారు తమ్మినేని.