Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ( vallabhanai Vamsi ) ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. నేరుగా హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. మూడు రోజుల కిందట ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. చంద్రబాబు సర్కార్ కుట్రతోనే వల్లభనేని వంశీని జైల్లో పెట్టినట్లు ఆరోపించారు. ఇంతకు ఇంత చెల్లించుకుంటామని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టినవారిని బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. అయితే జైలులో వల్లభనేని వంశీకి చుక్కలు కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి వెల్లడించారు.
* జైల్లో పేర్ని నాని పరామర్శ
ఈరోజు ములాఖత్ లో వల్లభనేని వంశీని కలుసుకున్నారు మాజీ మంత్రి పేర్ని నాని( perni Nani ). వంశీ భార్య పంకజశ్రీ తో కలిసి జైలులో ఉన్న వంశీని పరామర్శించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. జైలు అధికారులు వంశీని ఇబ్బంది పెడుతున్న వైనాన్ని ప్రస్తావించారు. వంశీని నేల మీదే పడుకోబెడుతున్నారని వెల్లడించారు. ఆయనకు వెన్ను నొప్పి ఉందని చెప్పినా.. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం ఎత్తైన అరుగు ఉంటే దానిపై పడుకునే అవకాశం ఇమ్మని అడుగుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వంశీ విషయంలో స్థానిక పోలీసుల నుంచి ఉన్నతాధికారుల వరకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
* కొనసాగుతున్న విచారణ..
అయితే వల్లభనేని వంశీకి ఇంటి భోజనం ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో( SC ST atrocity Court) పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. వంశి ఆరోగ్య పరిస్థితి పై రిపోర్ట్ ఇవ్వాలని నిన్న పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ రిపోర్ట్ వస్తే కానీ వంశీ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే వంశీని ప్రస్తుతానికి జైల్లో ప్రత్యేక గదిలో మాత్రమే ఉంచుతున్నారు. మిగతా గదుల్లో తీవ్ర నేరాలు చేసిన నేరస్తులు ఉండడంతో ఇలా ప్రత్యేక గదిని కేటాయించినట్లు పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇప్పుడు ఏకంగా జైలులో అధికారులు చుక్కలు చూపిస్తున్నారని మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించడం సంచలనంగా మారుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.