Mahesh Babu , Rajamouli
Rajamouli: రాజమౌళి.. అపజయమే ఎరుగని డైరెక్టర్. ఆయన తీసే సినిమాలు ఎంత బాగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రతి సన్నివేశాన్ని అద్దినట్టు తీస్తారు ఆయన.. అందుకే తనను ముద్దుగా అంతా జక్కన్న అని పిలుచుకుంటారు. ఇప్పటికే ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందించిన ధీరుడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1000కోట్ల నుంచి రూ.1500కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్ సినిమాలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఇది ఒకటి. భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఇప్పుడో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన భారీ సెట్టింగుల్లో జరుగుతుంది. సినిమా సెట్స్ మీదకు వెళ్లాక ఇదే మొదటి షెడ్యూల్ అని తెలుస్తోంది. అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత రాజమౌళి ప్రెస్ మీట్ ను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా తాను చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ముందు సినిమాలో నటించే నటీనటులు, తన టీమ్ తో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి అందులో నటించేబోయే క్యాస్టింగ్, టెక్నికల్ టీంను పరిచయం చేయాలని చూస్తున్నారట. ఆ సమయంలోనే సినిమా ఏ జానర్ లో, ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందన్న విషయాలను కూడా చెప్పబోతున్నారట. తన గత సినిమా ఆర్ఆర్ఆర్ కు కూడా రాజమౌళి ఈ విధానాన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం రాజమౌళి మొదటి నుంచి ఎందుకో సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఎస్ఎంబీ29 గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను రాజమౌళి ఈ ప్రెస్ మీట్ లో వెల్లడించే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ ప్రెస్ మీట్ తోనే రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించిన ప్రమోషన్లను కూడా మొదలుపెట్టనున్నట్లు టాక్. అతి త్వరలోనే ఈ ప్రెస్ మీట్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. త్వరలోనే రాజమౌళి మహేష్ సినిమా గురించి ప్రెస్ మీట్ తర్వాత అభిమానులకు ఉన్న పలు సందేహాలకు క్లారిటీ వచ్చే అవకాశముంది.