https://oktelugu.com/

Pawan kalyan And Nara Lokesh: చిన్న బాబుది అలకా? పవన్ తో విభేదాలా?

టిడిపి,జనసేనల మధ్య పొత్తు కుదిరిన తర్వాత తాడేపల్లిగూడెం, ప్రత్తిపాడు లో జెండా పేరిట భారీ బహిరంగ సభలను రెండు పార్టీలు నిర్వహించాయి. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశాయి. ఈ సభలో రెండు పార్టీల కీలక నాయకులు పాల్గొన్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 29, 2024 / 12:34 PM IST
    Follow us on

    Pawan kalyan And Nara Lokesh: నారా లోకేష్ తో పవన్ కు గ్యాప్ ఉందా? అందుకే జెండా సభలకు లోకేష్ హాజరు కాలేదా? పవన్ పట్టుబట్టడంతోనే లోకేష్ ను చంద్రబాబు పక్కన పెట్టారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇక ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం గురించి చెప్పనక్కర్లేదు. పవన్ కు భయపడే లోకేష్ ను చంద్రబాబు ఈ సభలకు రాకుండా అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. సీఎం పదవి షేరింగ్ విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలతో కాపుల్లో ఆగ్రహం ఉందని.. అందుకే పక్కన పెట్టారని టాక్ నడుస్తోంది.

    టిడిపి,జనసేనల మధ్య పొత్తు కుదిరిన తర్వాత తాడేపల్లిగూడెం, ప్రత్తిపాడు లో జెండా పేరిట భారీ బహిరంగ సభలను రెండు పార్టీలు నిర్వహించాయి. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశాయి. ఈ సభలో రెండు పార్టీల కీలక నాయకులు పాల్గొన్నారు. కానీ లోకేష్ మాత్రం హాజరు కాలేదు. దీంతో దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ అడ్డు చెప్పడం వల్లే లోకేష్ సభకు హాజరు కాలేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. జనసేన తో పొత్తు ఉన్నంత మాత్రాన పవన్ కు సీఎం పదవిలో షేరింగ్ ఇచ్చే అవకాశం లేదని ఆ మధ్యన లోకేష్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అది పెను దుమారానికి దారితీసింది. ఇప్పుడు తాజాగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో ఒక వర్గంలో అసంతృప్తి నెలకొంది. ఇటువంటి తరుణంలో లోకేష్ హాజరైతే అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుందని భావించడం వల్లే ఆయన గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

    అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్, లోకేష్ లు కలిశారు. నేరుగా జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించిన తర్వాత పవన్ పొత్తు ప్రకటన చేశారు. లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సభకు పవన్ హాజరయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారంలో చంద్రబాబుతో పవన్ చర్చించారే తప్ప.. ఎక్కడా లోకేష్ కనిపించలేదు. ఈ విషయంలో ఎక్కడా లోకేష్ జోక్యం చేసుకోలేదు. చివరకు తొలి జాబితా ప్రకటన సమయంలో కూడా లోకేష్ లేరు. జనసేనతో అధికారాన్ని పంచుకునే విషయంలో లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు చంద్రబాబు సీఎం గా ఉంటారని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఒకటి రెండుసార్లు పవన్ తప్పుపట్టారు కూడా. జగన్ ను అధికారం నుంచి దూరం చేయడమే ప్రధాన లక్ష్యమని.. అధికారాల పంపిణీ గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదని కూడా పవన్ మందలించారు. ఈ విభేదాలతోనే లోకేష్ తాజాగా జెండా సభలకు హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. వైసీపీ సోషల్ మీడియా దీనిపై మరింత ట్రోల్ చేస్తోంది.