Vijayasai Reddy : వైసీపీకి( YSR Congress ) రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. కొద్ది రోజుల కిందట సంచలన ప్రకటన చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి తాను రాజకీయాలు మాట్లాడనని.. రాజకీయాలు చేయనని కూడా తేల్చి చెప్పారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. తనకు ఇన్నేళ్లపాటు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈరోజు సిఐడి నోటీసులో అందుకున్న ఆయన విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో ఆయనకు సిఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో విచారణకు హాజరైన ఆయన.. అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరమైంది? చెప్పుకునే ప్రయత్నం చేశారు. జగన్ కోటరీ కారణంగానే తాను బయటకు వచ్చానని చెప్పారు. చెప్పుడు మాటలు విని జగన్ నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. కోర్టు అక్రమాలు, లిక్కర్ స్కాంపై సాయి రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి.
Also : విజయసాయిరెడ్డిని వదిలేదిలే.. పల్నాడు జిల్లాలో ఫిర్యాదు.. అరెస్టుకు రంగం సిద్ధం!
* కెవి రావు వై వి సుబ్బారెడ్డి కి సన్నిహితుడు
కాకినాడ సి పోర్టు( Kakinada seaport ) ప్రైవేట్ లిమిటెడ్ వాటాల బదలాయింపు పై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కెవి రావు నుంచి అక్రమంగా వాటాలు బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. అరబిందో సంస్థ నుంచి కెవి రావుకు దాదాపు 500 కోట్ల రూపాయల బదిలీ అయిన విషయంపై ప్రశ్నించారు. ఆ విషయం నాకు సంబంధం లేదని.. అసలు నిధులు బదిలీ అయిన విషయం తనకు తెలియదని వివరించినట్లు సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. విక్రాంత్ రెడ్డి గురించి అడిగితే సుబ్బారెడ్డి కుమారుడిగా తెలుసునని చెప్పానన్నారు. కాకా తనకు కెవి రావు అంటే ఇష్టం ఉండదని.. సుబ్బారెడ్డి అమెరికా వెళ్ళినప్పుడు కేవీ రావు ఇంట్లోనే ఉండేవారని సాయి రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు.
* జగన్ కు సంబంధం లేదు
కాకినాడ పోర్టు వ్యవహారంలో జగన్ కు ( Jagan Mohan Reddy) అసలు సంబంధం లేదని కూడా సాయి రెడ్డి తేల్చి చెప్పారు. తనను ఉద్దేశపూర్వకంగా ఒక అధికారి ఈ కేసులో ఇరికించారని చెప్పుకొచ్చారు. అరబిందో నుంచి వాటాల బదిలీపై ప్రశ్నించారని తెలిపారు. తన కుమార్తె వారి ఇంటికి పంపించానే తప్ప.. తనకు అరబిందో వాళ్లకు ఆర్థిక సంబంధాలు లేవని కూడా స్పష్టం చేశారు. జగన్ కోటరీ కారణంగానే తాను బయటకు వచ్చానని వెల్లడించారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగిపోయిందని చెప్పుకొచ్చారు. అందుకే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానని జగన్కు చెప్పానన్నారు. జగన్ కు ఎవరినైనా పరిచయం చేయాలనుకుంటే.. ముందుగా కోటరీ కి లాభం చేకూర్చాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
* తనపై జగన్ చేసిన ఆరోపణలపై..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి పై ( Vijaya Sai Reddy )సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సాయి రెడ్డి బయటకు వెళ్లాక ప్రలోభాలకు లొంగిపోయారని, విశ్వసనీయత కోల్పోయారన్న విషయాన్ని తాజాగా ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. తాను ప్రలోభాలకు లొంగి పోలేదని.. జగన్మోహన్ రెడ్డిలోనే మార్పు వచ్చిందని చెప్పారు సాయి రెడ్డి. తనకు, జగన్మోహన్ రెడ్డి మధ్య విభేదాలకు కారణం కోటరీ లోని వారేనని చెప్పుకొచ్చారు. ఆ కోటరికి దూరంగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. లిక్కర్ కేసులో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని.. సమయం వచ్చినప్పుడు మరిన్ని విషయాలు చెబుతానని కూడా పేర్కొన్నారు. అయితే తాజాగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ కూటమికి అస్త్రంగా మారనున్నాయి.
Also Read :వైయస్సార్ కాంగ్రెస్ ఇన్చార్జిలకు జీతాలు.. నిజం ఎంత?