JD Lakshminarayana: సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ జై భారత్ పేరుతో ఒక కొత్త పార్టీని ప్రకటించారు. రాజకీయాల్లో సమూల మార్పులే ధ్యేయంగా తాను పార్టీ పెట్టినట్లు చెప్పుకొస్తున్నారు. తన పార్టీలో యువతకు చోటిస్తానని చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందుగా రాజకీయ పార్టీ పెట్టి సంచలనానికి కారణమయ్యారు. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్న చర్చ నడుస్తోంది. అయితే జేడీ ని మాత్రం అటు టిడిపి తో పాటు ఇటు వైసిపి ప్రోత్సహించాయి అన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఆ పార్టీలకు వ్యతిరేకంగానే జెడి కొత్త పార్టీ పెట్టడం విశేషం.
సిబిఐ జెడిగా తెలుగు రాష్ట్రాలకు లక్ష్మీనారాయణ ఎంతో సుపరిచితం. ఎక్కడో ముంబై ఏటీఎస్ లో జెడి హోదాలో పని చేస్తున్న ఆయనను.. 2010లో సిబిఐ జెడి హోదాలో కూర్చోబెట్టి నాటి యూపీఏ గవర్నమెంట్ గుర్తింపునిచ్చింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ రోశయ్యను సీఎం చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని ధిక్కరించిన జగన్ ను కట్టడి చేసేందుకు సిపిఐ కేసులను నమోదు చేసింది. ఆ కేసుల దర్యాప్తు బాధ్యతను జేడీ లక్ష్మీనారాయణకు అప్పగించింది. అప్పుడే విశేష ప్రాచుర్యం లభించింది ఆయనకు.
నాటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసు విచారణను లక్ష్మీనారాయణ చేపట్టారు. అప్పట్లోనే ఆయన టిడిపి అనుకూల మీడియాకు కేసు విచారణకు సంబంధించి లీకులు ఇచ్చేవారు. ఆ వివరాలతోనే టిడిపి అనుకూల మీడియా రెచ్చిపోయేది. అదే సమయంలో జేడీ లక్ష్మీనారాయణ ఆకాశాన్ని ఎత్తేసేది. అటు తరువాత జగన్ కు బెయిల్ రావడం.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో జగన్ పై కేసుల తీవ్రత తగ్గింది. జెడి లక్ష్మీనారాయణ హవా కూడా తగ్గిపోయింది. అటు తరువాత ఏపీలో సైతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. టిడిపి ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం లభిస్తుందన్న జెడి ఆశలు నెరవేరలేదు.
జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి బయటకు వచ్చారు. కానీ రాజకీయంగా ఎటువంటి అవకాశం దక్కలేదు. దీంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఏరువాక వంటి వాటిపై ఫోకస్ పెట్టారు. విద్యార్థులతో మమేకమై పనిచేశారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో జనసేన టికెట్ దక్కింది. విశాఖ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. పవన్ సినిమాల్లో నటించడానికి తప్పుపడుతూ జనసేనను వీడారు. అప్పటినుంచి న్యూట్రల్ గా ఉంటూనే వైసీపీ ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ వచ్చారు.
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. దానిని సమర్థిస్తూ జెడి కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, నాడు నేడు పథకాల విషయంలో ప్రభుత్వ చర్యలను జెడి పొగిడారు. దీంతో వైసిపి అనుకూల మీడియాలో జెడి వార్తలు పతాక శీర్షికన వచ్చాయి. దీంతో ఆయన వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ పార్టీలోకి పర్వాలేదు కానీ.. తాము ఇచ్చిన పదవే తీసుకోవాలని.. విశాఖ ఎంపీ పదవి కుదరదని హై కమాండ్ తేల్చి చెప్పింది. దీంతో చేసేది లేక జెడి కొత్త పార్టీని ప్రకటించారు. అయితే ఈ పార్టీ ఏర్పాటు వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయంటూ విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అది నిజమా? నిజం కాదా? అన్నది ఎన్నికల్లో తేలిపోనుంది.