YS Sharmila : రాహుల్ కోసం షర్మిల కాస్త గట్టిగానే డిసైడ్ అయ్యిందే?

రాహుల్ ను ప్రధాని చేయాలన్న తండ్రి మాటలను గుర్తుచేయడం మాత్రం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. తద్వారా తాను కాంగ్రెస్ పార్టీలో గట్టిగానే పనిచేస్తానని షర్మిళ హెచ్చరికలు పంపారు.

Written By: Dharma, Updated On : July 10, 2023 12:28 pm
Follow us on

YS Sharmila : కాంగ్రెస్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం దగ్గర కానుందా? షర్మిళ, విజయమ్మలు కాంగ్రెస్ లో చేరనున్నారా? రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయాలన్న నాటి వైఎస్ఆర్ మాటను షర్మిళ ఎందుకు గుర్తుకు తెచ్చినట్టు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ జయంతి నాడు రాహుల్ గాంధీని ఉద్దేశించి షర్మిళ చేసిన ట్విట్ పెద్ద ప్రకంపనలే రేపుతోంది.వైఎస్ఆర్ నాయకత్వాన్ని కీర్తిస్తూ రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. దీనికి షర్మిళ స్పందించారు. నాడు తన తండ్రి మనోగతాన్ని గుర్తిస్తూ రాహుల్ కు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో జగన్ కట్టడి చర్యలు పనిచేయలేదనే రీతిలో షర్మిళ సంకేతాలు ఇచ్చారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిళ కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆమె ఖండించలేదు. కానీ చర్చలు విఫలమైన పరిస్థితుల్లో ఒక భిన్న ప్రకటన చేశారు. అయితే కాంగ్రెస్ లో కలవనని నేరుగా చెప్పలేదు. కర్నాటకకు చెందిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో షర్మిళ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాను తెలంగాణలో మాత్రమే ఉంటానని చెప్పడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. కానీ ఆమె కాంగ్రెస్ లో చేరడం ఖాయమని మాత్రం తేలింది. అయితే మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో జగన్ ను కలిసిన తరువాత షర్మిళ మనసు మార్చుకున్నట్టు వార్తలు వచ్చాయి.

కానీ వైఎస్సార్ జయంతి నాడు ఆమె ఒంటరిగానే ఇడుపాలపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. గత మూడు సంవత్సరాలుగా కుటుంబమంతా కలిసి నివాళులర్పించేవారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు జగన్, షర్మిళ ఒకేకారులో వచ్చి రోజంతా అక్కడే గడిపేవారు. కానీ గత ఏడాది సీన్ మారింది. తండ్రి సమాధి వద్దకు అంతా చేరినా జగన్, షర్మిళల మధ్య మాటలు లేవు. ఈ ఏడాది తల్లి విజయమ్మ కుమారుడు జగన్ తో రాగా.. షర్మిళ మాత్రం ఇతర కుటుంబసభ్యులతో ముందుగానే వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు. తొలుత కాంగ్రెస్ లో తన పార్టీ విలీన ప్రక్రియను తండ్రి సమాధి వద్దే చేస్తారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పెద్దలు వస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ వారెవరూ రాకపోవడంతో షర్మిళ వెనక్కి తగ్గారని భావించారు. కానీ రాహుల్ గాంధీ విషయంలో చేసిన ట్విట్ తో ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు నిర్థారణ అయ్యింది.

వైఎస్ కుటుంబం ఇంతటి నిర్ణయం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ పై కేసులు, జైలు జీవితానికి కారణమైన సోనియా గాంధీ కుటుంబం వైపు అస్సలు చూడకూడదు. మొన్నటివరకూ షర్మిళలో సైతం మొండితనం కనిపించింది. కానీ జగన్ చర్యలతో విసిగివేశారిపోయిన ఆమె తన రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ సరైన వేదిక అని భావించారు. తండ్రి ప్రాతినిధ్యం వహించిన పార్టీగా పునరాగమనానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే రాహుల్ ను ప్రధాని చేయాలన్న తండ్రి మాటలను గుర్తుచేయడం మాత్రం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. తద్వారా తాను కాంగ్రెస్ పార్టీలో గట్టిగానే పనిచేస్తానని షర్మిళ హెచ్చరికలు పంపారు.